టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్ తమకు కీలకమని న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర అన్నాడు. బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో రచిన్ రవీంద్ర(157 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 134) సెంచరీతో చెలరేగాడు. టీమ్ సౌథీ(73 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65) కలిసి 8వ వికెట్‌కు 138 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
దాంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగులు చేసింది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(63 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 52), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(102 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 70), సర్ఫరాజ్ ఖాన్(78 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. సెంచరీ దిశగా సాగిన విరాట్ కోహ్లీ.. మూడో రోజు ఆటలోని చివరి బంతికి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో ఆజాజ్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. గ్లేన్ ఫిలిప్స్ ఓ వికెట్ పడగొట్టాడు. టీమిండియా ఇంకా 125 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 46 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. మూడో రోజు ఆట ముగిసిన అనంతరం సెంచరీ హీరో రచిన్ రవీంద్ర అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియోసినిమాతో మాట్లాడాడు.
'విరాట్ కోహ్లీ వికెట్ మాకు చాలా కీలకం. ఎందుకంటే అతను గొప్ప ఆటగాడు. ఇప్పటికీ మేం ఆధిక్యంలోనే ఉన్నాం. నేను భాగస్వామ్యాలు నెలకొల్పేందుకు ప్రయత్నించాను. టీమ్ సౌథీతో పార్ట్‌నర్‌షిప్ నాకు బాగా సహకరించింది. ఈ వికెట్ బాగుంది. కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉంది. నా తండ్రితో పాటు కుటుంబ సభ్యుల సమక్షంలో సెంచరీ సాధించడం గొప్ప అనుభూతినిచ్చింది. బెంగళూరు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మద్దతు లభిస్తుండటం సంతోషంగా ఉంది.'అని రచిన్ రవీంద్ర చెప్పుకొచ్చాడు.