టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను తక్కువ అంచనా వేయడం మూర్ఖత్వమేనని న్యూజిలాండ్ వన్డే కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ అన్నాడు. ఈ ఇద్దరూ ఆటగాళ్లు ఇప్పటికీ సూపర్ ఫామ్‌లో ఉన్నారని, భారత జట్టుకు వారి అవసరం ఎంతో ఉందని చెప్పుకొచ్చాడు. మూడు వన్డేలు, ఐదు టీ20ల కోసం న్యూజిలాండ్ భారత్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 11న వడోదర వేదికగా జరిగే తొలి వన్డే మ్యాచ్‌తో న్యూజిలాండ్ పర్యటన మొదలు కానుంది.
ఈ సిరీస్ నేపథ్యంలో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మైఖేల్ బ్రేస్‌వెల్.. రోహిత్, కోహ్లీలపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ ఇద్దరూ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలను తక్కువ అంచనా వేయడం చాలా పెద్ద పొరపాటు. వారు ఇప్పటికీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. జట్టుకు వారి అవసరం కూడా ఎంతో ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వచ్చే ఏడాది (2027) జరిగే వన్డే ప్రపంచకప్‌లో కూడా ఆడాలని నేను కోరుకుంటున్నాను. వారు ప్రస్తుతం అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు.
వారిని జట్టులో నుంచి తొలగించడానికి ఎటువంటి కారణం నాకు కనిపించడం లేదు. వారి వ్యక్తిగత రికార్డులే వారు ఎంటో ప్రపంచానికి చెబుతాయి. భారత జట్టు సాధించిన ఎన్నో గొప్ప విజయాల్లో వారు భాగంగా ఉన్నారు. అటువంటి దిగ్గజాలను విమర్శించడం లేదా తక్కువ అంచనా వేయడం మూర్ఖత్వమే అవుతుంది.'అని బ్రేస్‌వెల్ చెప్పుకొచ్చాడు.
ఈ మూడు వన్డేల సిరీస్‌కు న్యూజిలాండ్ కీలక ఆటగాళ్లు మిచెల్ సాంట్నర్, టామ్ లాథమ్, రచిన్ రవీంద్ర అందుబాటులో లేకుండా పోయారు. దీంతో మైఖేల్ బ్రేస్‌వెల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. ఫిబ్రవరి జరిగే టీ20 ప్రపంచకప్‌కు సన్నద్దమవ్వడానికి ఈ సిరీస్ ఉపయోగపడుతుందని బ్రేస్ వెల్ తెలిపాడు.