ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు న్యూజిలాండ్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. మూడు వన్డేల సిరీస్‌ను గెలిచి భారత పర్యటనను ఘనంగా ప్రారంభించిన న్యూజిలాండ్‌కు ఐదు టీ20ల సిరీస్‌లో బిగ్ షాక్ తగిలింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయింది. ఈ మూడు మ్యాచ్‌ల్లో భారత్‌కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
ఈ ఘోర పరాజయం నేపథ్యంలోనే న్యూజిలాండ్ టీమ్ ఇద్దరి ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించి స్వదేశం పంపించింది. స్టార్ పేసర్ క్రిస్టియన్ క్లార్క్, బ్యాటర్ టీమ్ రాబిన్సన్‌లను జట్టు నుంచి విడుదల చేసింది. ఈ ఇద్దరి స్థానాల్లో జిమ్మీ నిషమ్, లాకీ ఫెర్గూసన్‌లను జట్టులోకి తీసుకుంది. త్రివేండ్రం వేదికగా జరిగే ఆఖరికి టీ20కి ఫిన్ అలెన్ కూడా అందుబాటులోకి వస్తాడని ట్వీట్ చేసింది.

'క్రిస్టియన్ క్లార్క్, టీమ్ రాబిన్సన్‌లను జట్టు నుంచి విడుదల చేశాం. వారి స్థానాల్లో జిమ్మీ నీషమ్, లాకీ ఫెర్గూసన్, టీమ్ సీఫెర్ట్ జట్టులోకి వచ్చారు. గురువారం త్రివేండ్రంలో ఫిన్ అలెన్ జట్టుతో కలుస్తాడు.'అని బ్లాక్ క్యాప్స్ ట్వీట్ చేసింది.
24 ఏళ్ల క్రిస్టియన్ క్లార్క్ జనవరి 21న నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టీ20తో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన క్లార్క్ 40 పరుగులిచ్చి ఒక వికెట్ తీసాడు. ఇదే మ్యాచ్‌లో టీమ్ రాబిన్సన్ 15 బంతుల్లో 21 పరుగులు చేశాడు. రెండో టీ20లో ఈ ఇద్దర్ని పక్కనపెట్టి మ్యాట్ హెన్రీ, టీమ్ సీఫెర్ట్‌లను తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దర్ని స్వదేశం పంపించారు.
బిగ్ బాష్ లీగ్ నేపథ్యంలో ఫిన్ అలెన్ భారత్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన రికార్డ్ ఫిన్ అలెన్ పేరిట ఉంది. బిగ్ బాష్ లీగ్‌లో 26 ఏళ్ల ఫిన్ అలెన్ పెర్త్ స్కార్చర్స్ తరఫున బరిలోకి దిగాడు. 11 మ్యాచ్‌ల్లో 466 పరుగులు చేశాడు. అతని రాకతో న్యూజిలాండ్ టీమ్ బలం పెరిగింది.
న్యూజిలాండ్ టీ20 టీమ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, జాకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ, జేమ్స్ నీషమ్, కైల్ జామిసన్, మైఖేల్ బ్రేస్‌వెల్, బెవాన్ జాకబ్స్, ఫిన్ అలెన్ (5వ టీ20కి మాత్రమే).