టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(7/59) సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్‌తో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఏడు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. వాషింగ్టన్ సుందర్ ధాటికి 259 పరుగులకు కుప్పకూలింది.
దాదాపు 45 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా టెస్ట్ టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన సుందర్.. అసాధారణ ప్రదర్శనతో నయా చరిత్రను లిఖించాడు. తన ప్రదర్శనతో విమర్శకుల నోర్లు మూయించాడు. తొలి టెస్ట్ పరాజయం అనంతరం వాషింగ్టన్ సుందర్‌ను సెలెక్టర్లు.. భారత జట్టుకు ఎంపిక చేయగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జట్టులో ఇప్పటికే ఎక్స్‌ట్రా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఉండగా.. సుందర్ ఎందుకు? అని ప్రశ్నించారు.

సుందర్ ఎందుకు అన్న ప్రశ్నకు అతను తన ఆటతోనే బదులిచ్చాడు. తన సహచర తమిళ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(3/64) కలిసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. తద్వారా టీమిండియా సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఆఫ్ స్పిన్నర్లు 10 వికెట్లు తీయడం ఇదే తొలిసారి.
హాఫ్ సెంచరీతో నిలకడగా ఆడుతున్న రచిన్ రవీంద్రను సుందర్ ఔట్ చేసిన విధానం ఈ మ్యాచ్‌కే హైలైట్. ఈ వికెటే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పతనాన్ని శాసించింది.
అద్భుతమైన టర్న్‌తో రచిన్ రవీంద్రను బోల్తా కొట్టిన సుందర్.. ఆ తర్వాత టామ్ బ్లండెల్(3)ను అదే తరహాలో పెవిలియన్ చేర్చాడు. గ్లేన్ ఫిలిప్స్(9)ను క్యాచ్ ఔట్ చేసిన సుందర్... మిచెల్ సాంట్నర్(33), టీమ్ సౌథీ(5), అజాజ్ పటేల్(4)ను క్లీన్ బౌల్డ్ చేసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. సుందర్ తీసిన ఏడు వికెట్లలోనే ఐదు క్లీన్ బౌల్డ్ ద్వారానే లభించడం విశేషం.
సుందర్ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అదిరందయ్యా సుందరం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కోచ్ గౌతమ్ గంభీర్ పెట్టుకున్న నమ్మకాన్ని సుందర్ నిలబెట్టుకున్నాడని, బ్యాటింగ్‌లో కూడా సత్తా చాటి జట్టులో చోటు ఖాయం చేసుకోవాలని సూచిస్తున్నారు.
న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65)తో పాటు డేవాన్ కాన్వే(141 బంతుల్లో 11 ఫోర్లతో 76) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.