టీమిండియాలోని నలుగురు స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించడంతోనే ఓటమిపాలయ్యామని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో టీమిండియా తమ కంటే మెరుగైన ప్రదర్శన చేసిందని అంగీకరించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన టీమిండియా 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 79) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్(61 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 42), హార్దిక్ పాండ్యా(45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(5/42) ఐదు వికెట్లు తీయగా.. కైల్ జెమీసన్, విల్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీసారు.

అనంతరం న్యూజిలాండ్ ఓవర్లలో 45.3 ఓవర్లలో 205 పరుగులకే కుప్పకూలింది. కేన్ విలియమ్సన్(120 బంతుల్లో 7 ఫోర్లతో 81) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. వరుణ్ చక్రవర్తీ(5/42) ఐదు వికెట్లతో చెలరేగగా.. కుల్దీప్ యాదవ్(2/56) రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన మిచెల్ సాంట్నర్.. పిచ్‌ను అంచనా వేయడంలో తాము విఫలమయ్యామని తెలిపాడు. తాము ఊహించినదాని కంటే ఎక్కువగా బంతి స్పిన్ అయ్యిందని అభిప్రాయపడ్డాడు. 'ఇది చాలా స్లో వికెట్. మిడిల్ ఫేజ్‌లో టీమిండియా గేమ్‌ను బాగా కంట్రోల్ చేసింది. శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేయగా.. హార్దిక్ పాండ్యా అదిరిపోయే ముగింపు అందించాడు. మేం ఊహించినదాని కంటే ఎక్కువ బంతి స్పిన్ అయ్యింది.
ఇక్కడ జరిగిన ఇతర గేమ్స్ కంటే కూడా ఎక్కువ టర్న్ అయ్యింది. నలుగురు నాణ్యమైన స్పిన్నర్లు మా పతనాన్ని శాసించారు. పవర్ ప్లేలోనే వికెట్లు తీయడం ఈ మ్యాచ్‌లో మాకు దక్కిన సానుకూలంశం. కేన్ విలియమ్సన్ అద్భుతంగా ఆడాడు. సౌతాఫ్రికా నాణ్యమైన జట్టు. లాహోర్ వేదికగా మా సెమీస్ మ్యాచ్ జరగనుంది. ఆ పిచ్ పేస్‌తో పాటు బౌన్స్‌కు అనుకూలంగా ఉంటుంది. మ్యాట్ హెన్రీ కీలకం కానున్నాడు. సౌతాఫ్రికాలో అద్బుతమైన నలుగురు పేసర్లు ఉన్నారు. వారిని ఎలా ఎదుర్కొంటామో చూడాలి. సెమీస్ మ్యాచ్‌కు ఫ్రెష్ వికెట్ కేటాయిస్తారా? లేక వాడిన పిచ్ ఉపయోగిస్తారా? అనేది చూడాలి. పిచ్ కండిషన్స్ బట్టి మా కాంబినేషన్‌ను ఎంచుకుంటాం.'అని మిచెల్ సాంట్నర్ తెలిపాడు.