బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. పవర్ ప్లేలో దక్కిన శుభారంభాన్ని కొనసాగించలేకపోయామని తెలిపాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన మిచెల్ సాంట్నర్.. టీమిండియా స్పిన్నర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. అసాధారణ ప్రదర్శనతో తమ ఓటమిని శాసించారని కొనియాడాడు. టీమిండియాలోని నలుగురు స్పిన్నర్లు వరల్డ్ క్లాస్ బౌలర్లని మెచ్చుకున్నాడు. బ్యాటింగ్‌లో తమ జట్టు 25 పరుగులు తక్కువ చేసిందని అభిప్రాయపడ్డాడు.
వారి వల్లే ఈ ఓటమి..
'ఇదో అద్భుతమైన టోర్నీ. మేం ఎన్నో సవాళ్లను సమష్టిగా ఎదుర్కొన్నాం. అద్భుతమైన క్రికెట్ ఆడాం. ఈ రోజు టాప్ క్లాస్ టీమ్ చేతిలో ఓడిపోయాం. ఈ మ్యాచ్‌లో ఓడినా.. మా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. విభిన్న పరిస్థితుల్లో ముందుకొచ్చి మెరుగైన ప్రదర్శన చేశారు. ఓ కెప్టెన్‌గా మా ఆటగాళ్ల నుంచి ఇంతకంటే ఏం ఆశించాలి. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పవర్ ప్లే తర్వాత మేం వరుసగా వికెట్లు కోల్పోయాం. ఈ గెలుపు క్రెడిట్ టీమిండియా స్పిన్నర్లదే. నలుగురు స్పిన్నర్లు వరల్డ్ క్లాస్ బౌలర్లు. మేం మా లక్ష్యానికి 25 పరుగులు తక్కువగా చేశాం. అయినా విజయం కోసం ఆఖరి వరకు పోరాడాం. ఫిలిప్స్ మరోసారి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.

రోహిత్ బ్యాటింగ్ సూపరో సూపర్..
పవర్ ప్లే బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆ అవకాశాన్ని క్యాష్ చేసుకున్నారు. రోహిత్ బ్యాటింగ్ అసాధారణం. అతను మమ్మల్ని బ్యాక్‌ఫుట్‌లో పెట్టాడు. కానీ మ్యాచ్‌లోని పరిస్థితులు ఒక్కసారి మారిపోతాయని మాకు తెలుసు. వికెట్లు తీస్తే పట్టు సాధించవచ్చని భావించాం. ప్రధాన టోర్నీల్లో రచిన్ రవీంద్ర అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. గ్లేన్ ఫిలిప్స్‌తో కలిసి అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇంత చిన్న వయసులోనే ఆటను అర్థం చేసుకోవడంతో పాటు ఆరంభంలో టీమిండియాపై ఒత్తిడి తెచ్చాడు. ఈ టోర్నీలో మా జట్టు ఆటతీరు సంతోషాన్నిచ్చింది. మా ప్లేయర్లు అంతా నా పనిని సులువు చేశారు. మేం విభిన్నమైన పిచ్‌లకు అడ్జస్ట్ అయ్యాం. తృటిలో టైటిల్ కోల్పోయినా.. ఇది మాకు గొప్ప టోర్నీ'అని మిచెల్ సాంట్నర్ చెప్పుకొచ్చాడు.
తిప్పేసిన స్పిన్నర్లు..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. మైకేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్), డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(2/45), కుల్దీప్ యాదవ్(2/40) రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ(1/74), రవీంద్ర జడేజా(1/30) తలో వికెట్ పడగొట్టారు.
గెలిపించిన రాహుల్..
అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో) శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 34 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ (2/46), మైకేల్ బ్రేస్‌వెల్(2/28) రెండేసి వికెట్లు తీయగా.. రచిన్ రవీంద్ర, కైల్ జెమీసన్ చెరో వికెట్ పడగొట్టాడు.