IND vs NZ: సూర్యకుమార్, పంత్ కాదు.. నాలుగో స్థానంలో అతడిని పంపాలి! కోహ్లీకి భారత మాజీ క్రికెటర్ సూచన!

ముంబై: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్-12లో భారత్ ఈరోజు (అక్టోబర్ 31) న్యూజిలాండ్‌తో తలపడనుంది. టీమిండియాకు ఇది చావోరేవో మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిస్తేనే కోహ్లీసేన సెమీస్ రేసులో ఉంటుంది. దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుండగా.. తుది జట్టుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్.. న్యూజిలాండ్‌తో కీలకమైన మ్యాచ్‌కి తుది జట్టులో మార్పులు చేస్తే మంచిదని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓ విలువైన సూచన చేశాడు.

తుది జట్టుపై ఆసక్తి
ఆల్‌రౌండర్‌గా జట్టులో ఉన్న హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకపోవడంతో అతనిపై వేటు వేసి హిట్టర్ ఇషాన్ కిషన్ లేదా మరో ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్‌ని జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్లు టీమిండియాకు సూచిస్తున్నారు. ఫామ్ కోల్పోయిన భువనేశ్వర్ కుమార్‌ని తప్పించి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేదా శార్ధూల్ ఠాకూర్‌కి చోటివ్వాలని మరికొంతమంది మాజీలు సూచిస్తున్నారు.
అయితే జట్టు ఓడిపోయినా, గెలిచినా మార్పులు చేయకుండా ఆటగాళ్లపై నమ్మకం ఉంచడం టీమ్ మెంటార్ ఎంఎస్ ధోనీ స్టయిల్. మహీ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంటాడు. దాంతో తుది జట్టు విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎలాంటి సూచనలు చేస్తాడో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. హార్దిక్ తుది జట్టులో కొనసాగడం ఖాయం కాగా.. భువనేశ్వర్ విషయంలోనే ఓ స్పష్టత రావాల్సి ఉంది.

నాలుగో స్థానంలో జడేజాను ఆడించాలి
ఇక భారత్ నాలుగో స్థానంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఆడించాలని బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారి సూచించాడు. తాజాగా ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన తివారి.. భారత జట్టు ఆట తీరుపై స్పందించాడు. పాక్‌తో ఓటమి, తిరిగి పుంజుకునే విషయాలపై కూడా తన ఆలోచనలు పంచుకున్నాడు. కోహ్లీసేన బ్యాటింగ్ ఆర్డర్ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని, టాప్ ఆర్డర్ వైఫల్యమే దాయాదుల పోరులో ఓటమికి కారణమైందని అతడు వెల్లడించాడు.
'నేను ఇంతకుముందు చెప్పినట్టు రవీంద్ర జడేజాను నాలుగో స్థానానికి ప్రమోట్ చేయాలి. ఎందుకంటే న్యూజిలాండ్‌తో మనం కీలకమైన మ్యాచ్ ఆడుతున్నాం. జడేజా తర్వాత రిషబ్ పంత్ క్రీజులోకి రావాలి. చివరి ఓవర్లలో పంత్ చెలరేగుతాడు' అని తివారి అన్నాడు.

స్రైక్ రొటేట్ చేస్తూ బౌండరీలు బాదగలడు
'టాప్ ఆర్డర్‌లో నలుగురు ఆటగాళ్లు కుడి చేతి వాటం గల బ్యాటర్లు ఉన్నారు. అలా కాకుండా నాలుగో స్థానంలో ఎడమచేతి వాటం గల రవీంద్ర జడేజాను పంపించాలి. అలా చేస్తే బౌలర్లకు ఇబ్బందిగా మారి లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేరు. అయితే నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ లేదా రిషబ్ పంత్‌ను టీమిండియా పంపుతోంది. కానీ జడేజా ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడు స్రైక్ రొటేట్ చేస్తూ బౌండరీలు బాదుతూ పరుగులు సాధిస్తాడు. జడేజాను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపే ప్రయత్నం చేస్తే బాగుంటుంది' అని మనోజ్ తివారి పేర్కొన్నాడు.

పాండ్యాను డ్రాప్ చేయడం అన్యాయం
'టీమ్ మేనేజ్‌మెంట్ ఇషాన్ కిషన్‌ని తీసుకురావాలని నిర్ణయించుకుంటే.. అప్పుడు సూర్యకుమార్ యాదవ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అయితే ఓపెనర్‌గా ఇషాన్ మెరుగ్గా రాణించడం మనం చూశాం. కాబట్టి అతనికి మిడిల్ ఆర్డర్‌లో అవకాశం దక్కడం కష్టమే అవుతుంది. సూర్య మిడిల్ ఆర్డర్‌లో బాగా ఆడగలడు. మైదానం మొత్తం షాట్‌లు ఆడతాడు. కాబట్టి సూర్య ఇన్నింగ్స్ చివరిలో ఉపయోగపడతాడు.
కేవలం ఒక గేమ్ తర్వాత హార్దిక్ పాండ్యాను డ్రాప్ చేయడం అన్యాయం. అతడిని జట్టులో కొనసాగించాలనుకుంటే పాండ్యాకు అనువైన స్లాట్‌ను కనుగొనాలి. హార్దిక్ బయట కూర్చున్న బ్యాటర్ల కంటే గొప్పవాడు. అతను తిరిగి ఫామ్‌లోకి రావాలంటే.. మధ్య ఓవర్లలో కొంత సమయం ఇవ్వాలి' అని తివారి చెప్పుకొచ్చాడు. భారత్ మంచి అనుభవం కలిగిన జట్టని, ఇకపై ఆడే ప్రతి గేమ్ మంచి రన్ రేట్‌తో గెలవాలని కోరాడు. న్యూజిలాండ్‌తో పోరులో కోహ్లీసేన విజయం సాధిస్తుందని తివారి ఆశాభావం వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
AFG Playing 11 vs NAM: ఓపెనర్లుగా జజాయ్, షాజాద్!ఫామ్‌లో రషీద్, నబీ!నమీబియాతో బరిలోకి దిగే అఫ్గాన్ జట్టిదే!