న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో టీమిండియా 285 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ నిరాశపర్చగా.. కేఎల్ రాహుల్( 92 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 112 నాటౌట్) అజేయ శతకంతో టీమిండియాను ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 284 పరుగులు చేసింది. రాహుల్ అజేయ శతకానికి తోడుగా శుభ్‌మన్ గిల్(53 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్(3/56) మూడు వికెట్లు తీయగా.. కైల్ జెమీసన్, జాక్ ఫోక్స్, జైడన్ క్లార్క్, మైఖేల్ బ్రెస్‌వెల్ తలో వికెట్ తీసారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆచితూచి ఇన్నింగ్స్ ప్రారంభించారు. క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకున్న ఈ జోడీ.. ఆ తర్వాత దూకుడుగా ఆడింది. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్ బౌండరీల మోత మోగించాడు. దాంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. తన శైలికి భిన్నంగా ఆడుతూ ఇబ్బంది పడిన రోహిత్ శర్మ(24)ను క్రిస్టియన్ క్లార్క్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 70 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీ తరలించి దూకుడు కనబర్చాడు. మరోవైపు శుభ్‌మన్ గిల్ 47 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సాధికారికంగా ఆడుతున్న రాహుల్‌ను జెమీసన్ అద్భుత బంతితో బోల్తా కొట్టించాడు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇద్దరూ డిఫెన్స్‌కే పరిమితమవడంతో కివీస్ బౌలర్లు బౌండరీ ఇవ్వకుండా మరింత ఒత్తిడి పెంచాడు. వరుస ఓవర్లలో క్రిస్టియన్ క్లార్క్ శ్రేయస్ అయ్యర్(8), విరాట్ కోహ్లీ(23)లను ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీసాడు. అయ్యర్‌ను క్యాచ్ ఔట్ చేసిన క్లార్క్.. స్టన్నింగ్ డెలివరీతో కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో 118 పరుగులకే భారత్ 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా జట్టును ఆదుకున్నారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ ఐదో వికెట్‌కు 73 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. జడేజా పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితం కాగా.. రాహుల్ వేగంగా ఆడాడు. 52 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ చేయగా.. జడేజా(27) బ్రేస్‌వెల్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి సిక్సర్‌తో జోరు కనబర్చినా.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఫోక్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. సిరాజ్ సాయంతో రాహుల్ 82 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 96 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జెమీసన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకోవడం గమనార్హం. రాహుల్‌కు ఇది 8వ వన్డే సెంచరీ. ఆఖరి ఓవర్‌లో రెండు బౌండరీలు బాదిన రాహుల్.. జట్టు స్కోర్‌ను 280 ధాటించాడు.