36 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత గడ్డపై టెస్ట్ విజయాన్నందుకున్న న్యూజిలాండ్‌కు గట్టి షాక్ తగిలింది. పుణె వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌కు కూడా ఆ జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ వెల్లడించాడు.
గాయం నుంచి విలియమ్సన్ ఇంకా కోలుకోలేదని, పూర్తి ఫిట్‌నెస్‌తో లేడని చెప్పాడు. అతని రిహాబిలిటేషన్ ఇంకా పూర్తవ్వలేదన్నాడు. మూడో టెస్ట్‌కు అతను అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నామని చెప్పాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు విలియమ్సన్‌కు తగిన సమయం ఇస్తామని, అతని విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోమని స్పష్టం చేశాడు.

ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో విలియమ్సన్ గాయపడ్డాడు. గజ్జలో తీవ్ర గాయం కావడంతో భారత్‌తో బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్ ఆడలేదు. విలియమ్సన్ గైర్హాజరీలోనూ న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శనతో సంచలన విజయాన్నందుకుంది.
ఈ గెలుపుతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత గడ్డపై ఇప్పటి వరకు 37 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్ మూడు మాత్రమే గెలిచింది. తాజా బెంగళూరు టెస్ట్ విజయానికి ముందు 1988లో భారత్ గడ్డపై విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు టెస్ట్‌లో వర్షం అంతరాయం కలిగించడం న్యూజిలాండ్ విజయానికి కలిసొచ్చింది.
పుణే వేదికగా జరిగే రెండో టెస్ట్ అయినా ఆడుతాడని భావించిన విలియమ్సన్.. ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. దాంతో ఆ జట్టు అభిమానులతో పాటు భారత అభిమానులు కూడా నిరాశకు గురయ్యారు. కేన్ విలియమ్సన్‌కు భారత్‌లోనూ అభిమానులు ఉన్నారు. అతన్ని కేన్ మామ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా నవంబర్ 1 నుంచి మూడో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు కేన్ మామ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.