న్యూజిలాండ్‌తో మూడో టీ20లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. గ్లేన్ ఫిలిప్స్(40 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 48), మార్క్‌చాప్‌మన్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32), మిచెల్ సాంట్నర్(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(3/17) మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా(1/35) ఒక వికెట్ తీసాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. హర్షిత్ రాణా వేసిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ డెవాన్ కాన్వే(1) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. వరుసగా ఐదో సారి కాన్వేను హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన రచిన్ రవీంద్ర(12)ను మరుసటి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. టీమ్ సీఫెర్ట్(12)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో న్యూజిలాండ్ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి 36 పరుగులే చేసింది.

ఈ పరిస్థితుల్లో గ్లేన్ ఫిలిప్స్, మార్క్‌చాప్‌మన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని రవి బిష్ణోయ్ విడదీసాడు. మార్క్ చాప్‌మన్(32)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. డారిల్ మిచెల్(14)ను హార్దిక్ పాండ్యా ఔట్ చేయగా.. హాఫ్ సెంచరీకి చేరువైన గ్లేన్ ఫిలిప్స్(48)ను రవి బిష్ణోయ్ పెవిలియన్ చేర్చాడు. కైల్ జెమీసన్(3)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయగా.. మ్యాట్ హెన్రీ(1)ని ఇషాన్ కిషన్ రనౌట్ చేశాడు. దూకుడుగా ఆడిన మిచెల్ సాంట్నర్(27)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు.