ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తుది పోరుకు సిద్దమైంది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్లో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. వరుస విజయాలతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన టీమిండియా.. టైటిల్ ఫైట్‌లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. దుబాయ్ వేదికగానే ఈ మ్యాచ్ జరుగుతుండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తుండటంతో భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్ వేదికగానే ఆడుతోంది.
లీగ్ దశలో మూడింటికి మూడు గెలిచిన టీమిండియా.. ఇదే వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరింది. అయితే దుబాయ్ టీమిండియాకు హోమ్ గ్రౌండ్ మారిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ టీమిండియాకు మెరుగైన రికార్డ్స్ ఉన్నాయి. దుబాయ్ గడ్డపై భారత్ ఇప్పటి వరకు 10 వన్డే మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 2018 ఆసియా కప్ సందర్భంగా అఫ్గాన్‌తో మ్యాచ్‌ను టై చేసుకుంది. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా భారత్ ఆసియాకప్‌తో కలిపి రెండు వన్డే సిరీస్‌లు ఆడింది.

ఈ రెండింటిలోనూ విజయం సాధించింది. తాజా ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాను వరుసగా ఓడించింది. ఇదే జోరులో ఫైనల్లో న్యూజిలాండ్‌ను మరోసారి మట్టికరిపిస్తోందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ను మూడు సార్లు ఓడించిన భారత్.. హాంకాంగ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై ఒక్కోసారి విజయం సాధించింది. స్పిన్‌కు అనుకూలంగా ఉన్న దుబాయ్ వికెట్‌ను భారత స్పిన్నర్లు సమర్థవంతంగా వాడుకుంటున్నారు. భారత బ్యాటర్లు ఈ పిచ్ కండిషన్స్ తగ్గట్లూ ఓపికగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. దాంతో భారత్ వరుస విజయాలు సాధించి ఫైనల్‌కు చేరింది.
ఫైనల్లో ఓపెనర్లు మెరుగైన ఆరంభం అందిస్తే టీమిండియాకు తిరుగుండదు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన శుభ్‌మన్ గిల్ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో విఫలయ్యాడు. ఫైనల్లోనైనా అతను భారీ స్కోర్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ టోర్నీకి ముందు సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ.. ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దూకుడుగా ఆడే క్రమంలో త్వరగా ఔటవుతున్నాడు. ఫైనల్లోనైనా అతను సత్తా చాటాల్సిన అవసరం ఉంది. కోహ్లీ, అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తీ, మహమ్మద్ షమీ మరోసారి కీలకం కానున్నారు.