
కాన్పూర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో టీమిండియా టాప్-3 వికెట్లను త్వరగా కోల్పోయింది. ఫస్ట్ సెషన్‌లో బాగానే ఆడిన భారత్.. సెకండ్ సెషన్‌లో వరుసగా వికెట్లను చేజార్చుకుంది. అయితే భారత్ టాప్-3 బ్యాట్స్‌మన్ చేసిన పరుగులు 13వ ఎక్కాన్ని పోలి ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఫస్ట్ వికెట్‌గా వెనుదిరిగిన మయాంక్ అగర్వాల్ 13 పరుగులు చేయగా.. మూడో వికెట్‌గా ఔటైన పుజారా 26 రన్స్ చేశాడు. ఇక సెకండ్ వికెట్ అయినటువంటి శుభ్‌మన్ గిల్ 52 పరుగులు చేశాడు. దాంతో వీరి స్కోర్లు 13వ ఎక్కాన్ని గుర్తు చేస్తున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లెక్కలకు సంబంధించిన పోస్ట్‌లు నెట్టింట వైరల్‌గా మారాయి.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఆదిలోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్(13) వికెట్ కోల్పోయింది. కైల్ జెమీసన్ బౌలింగ్‌లో మయాంక్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి వచ్చిన పుజారాతో మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(87 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడటంతో లంచ్ బ్రేక్ సమయానికి భారత్.. 29 ఓవర్లలో వికెట్ నష్టానికి 82 రన్స్ చేసింది.

లంచ్ బ్రేక్ అనంతరం భారత్ గట్టి షాక్ తగిలింది. హాఫ్ సెంచరీతో జోరు మీదున్న శుభ్‌మన్ గిల్‌ను కైల్ జెమీసన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానేతో పుజారా ఆచితూచి ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లను గౌరవిస్తూ పూర్తి రక్షణాత్మక ధోరణీలో బ్యాటింగ్ చేశారు. 75వ బంతికి పుజారా బౌండరీ బాదాడంటే అర్థం చేసుకోవచ్చు. అతను ఎంత నిదానంగా ఆడాడో. అయితే పుజారాను టీమ్ సౌథీ కీపర్ క్యాచ్‌గా బోల్తా కొట్టించి పెవిలియన్ చేర్చాడు. ఔట్ స్వింగ్ బాల్‌ను అంచనా వేయడంతో విఫలమైన పుజారా మూల్యం చెల్లించుకున్నాడు.
అనంతరం అరంగేట్ర ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి రాగా.. కెప్టెన్ రహానే నిదానంగా ఆడాడు. 6 ఫోర్లతో మంచి టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ జెమీసన్ బౌలింగ్‌లో పూర్తిగా తడబడిన అతను రివ్యూ సాయంతో ఔటయ్యే ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నాడు. కానీ ఆ మరుసటి బాల్‌కే క్లీన్ బౌల్డై పెవిలియన్ బాట పట్టాడు. దాంతో 145 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(14 నాటౌట్)తో పాటు రవీంద్ర జడేజా(4 బ్యాటింగ్) ఉన్నాడు.