ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌కు చేరిన టీమిండియాను ఓ సెంటిమెంట్ భయపెడుతోంది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ వేదికగా జరిగే మెగా పోరులో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన రోహిత్ సేన పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇప్పటికే లీగ్ దశలో న్యూజిలాండ్‌ను టీమిండియా ఓడించింది. అయినా కివీస్‌తో ఫైనల్ అంటే భారత అభిమానులకు భయం కలుగుతోంది.
అసాధారణ బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ సూపర్ ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా ఆ జట్టులో స్పెషలిస్ట్ స్పిన్ ఆల్‌రౌండర్లు ఉండటం టీమిండియా అభిమానులను మరింత కలవరపెడుతోంది. అయితే ఆదివారం ఫైనల్ జరగనుండటం వారి భయాన్ని రెట్టింపు చేసింది. ఎందుకంటే ఆదివారం జరిగిన ఐసీసీ టోర్నీ ఫైనల్లో భారత్ ఇప్పటి వరకు విజయం సాధించలేదు.

భారత్ గెలిచిన 1983 వన్డే ప్రపంచకప్(శనివారం), 2002 ఛాంపియన్స్ ట్రోఫీ(సోమవారం), 2007 టీ20 ప్రపంచకప్ సోమవారం, 2011 వన్డే ప్రపంచకప్(శనివారం), 2013 ఛాంపియన్స్ ట్రోఫీ(సోమవారం), 2024 టీ20 ప్రపంచకప్(శనివారం) గెలిచింది. 2000 నాకౌట్ ట్రోఫీ, 2014 టీ20 ప్రపంచకప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ 2003, 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ ఆదివారం జరగ్గా టీమిండియా ఓడిపోయింది.
ఈ సెంటిమెంట్‌ను టీమిండియా తిరగరాస్తుందా? లేక కొనసాగిస్తుందా? అనే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. దాంతో సోషల్ మీడియా వేదికగా ఈ సెంటిమెంట్ తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఒత్తిడిని అధిగమించి మెరుగైన ప్రదర్శన చేసే జట్టునే విజయం వరిస్తుందని, ఈ సెంటిమెంట్స్ అంత ప్రభావం చూపవని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.
మరోవైపు ఈ మెగా ఫైనల్ కోసం టీమిండియా సన్నదమవుతోంది. ఫైనల్లో రచించాల్సిన వ్యూహాలను సిద్దం చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి న్యూజిలాండ్ చేతిలో 2000 నాకౌట్ టోర్నీ, డబ్ల్యూటీసీ 2021 ఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తుంది.