న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమి దిశగా సాగుతోంది. 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 462 పరుగులకు కుప్పకూలింది. సర్ఫరాజ్ ఖాన్(195 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లతో 150), రిషభ్ పంత్(105 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 99) రాణించినా... లోయరార్డర్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో ప్రత్యర్థి ముందు 108 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. స్పిన్నర్లు అద్భుతం చేస్తే తప్పా ఈ మ్యాచ్‌లో టీమిండియా గట్టెక్కే పరిస్థితులు లేవు.
రోహిత్ శర్మ(63 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 52), విరాట్ కోహ్లీ(102 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 70) హాఫ్ సెంచరీలతో గట్టి పునాది వేయగా.. సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ అసాధారణ బ్యాటింగ్‌తో భారత్‌కు భారీ లక్ష్యం నమోదు చేస్తుందనిపించింది. కానీ సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ ఔటవ్వడంతో భారత ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది.

జట్టును గట్టెక్కిస్తారని భావించిన కేఎల్ రాహుల్(12), రవీంద్ర జడేజా(5), రవిచంద్రన్ అశ్విన్(15) తీవ్రంగా నిరాశపరిచారు. 29 పరుగుల వ్యవధిలోనే టీమిండియా చివరి 5 వికెట్లు కోల్పోవడం విశేషం. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓ రూర్కీ మూడేసి వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ, గ్లేన్ ఫిలిప్స్ తలో వికెట్ తీసారు. అజాజ్ పటేల్‌కు రెండు వికెట్లు దక్కాయి.
231/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్ భారీ స్కోర్ అందించారు. అద్భుత బ్యాటింగ్‌తో నాలుగో వికెట్‌కు 177 పరుగులు జోడించారు. కానీ ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో వారి పోరాటానికి విలువ లేకుండా పోయింది. కనీసం 150-200 పరుగుల లక్ష్యం నమోదు చేసినా గెలవడానికి ఆస్కారం ఉండేది.
చివరి రోజు నాలుగో ఇన్నింగ్స్ ఆడటం ఏ జట్టుకైనా కష్టమే. కానీ స్వల్ప లక్ష్యం ఉండటంతో న్యూజిలాండ్ ఆచితూచి ఆడే అవకాశం ఉంది. గతంలో ఈ స్కోర్‌ను కూడా కాపాడుకున్న రికార్డ్ టీమిండియాకు ఉంది. టీమిండియా స్పిన్ త్రయం నిప్పులు చెరిగితే సంచలన విజయాన్ని అందుకోవచ్చు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 46 పరుగులకు ఆలౌటవ్వగా.. న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆ జట్టుకు 356 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఓ దశలో ఇన్నింగ్స్ తేడాతో టీమిండియాకు ఓటమి తప్పదని భావించగా.. పంత్, సర్ఫరాజ్ ఖాన్ సూపర్ బ్యాటింగ్‌తో పరువు కాపాడారు.