న్యూజిలాండ్, వర్షంతో టీమిండియాకు విడదీయని బంధం ఉంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే టీమిండియాకు ఓటమే. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ నుంచి ఈ సెంటిమెంట్ కొనసాగుతోంది. అరంగేట్ర డబ్ల్యూటీసీ 2021 ఫైనల్లోనూ వర్షం కారణంగా టీమిండియాకు ప్రతికూల ఫలితమే ఎదురైంది. తాజాగా బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లోనూ ఈ సెంటిమెంట్ కొనసాగింది.
వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో..
2019 వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడింది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓటమే ఎదురైంది. తొలి రోజు గెలిచేలా కనిపించిన టీమిండియా.. ఓవర్‌కాస్ట్ కండీషన్స్ సందర్భంగా బ్యాటింగ్‌లో రాణించలేకపోయింది. 240 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అందుకోలేకపోయింది.

డబ్ల్యూటీసీ ఫైనల్లో
డబ్ల్యూటీసీ 2021 ఫైనల్లోనూ న్యూజిలాండ్, టీమిండియా తలపడగా.. వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఓవర్‌కాస్ట్ కండీషన్స్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకొని టీమిండియా పతనాన్ని శాసించింది. రిజర్వ్‌డేతో కలిపి ఈ మ్యాచ్‌ను ఆరు రోజుల పాటు నిర్వహించారు.
ఓవర్‌కాస్ట్ కండీషన్స్..
తాజాగా బెంగళూరు వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు వాతావరణం సహకరించింది. వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా రద్దవ్వగా.. రెండో రోజు టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా పిచ్‌పై కవర్లు కప్పి ఉంచడం.. మైదానాన్ని మబ్బులు కమ్మేయడంతో టాస్ ఓడి బౌలింగ్‌కు దిగిన న్యూజిలాండ్ బౌలర్లు స్వింగ్ బౌలింగ్‌తో నిప్పులు చెరిగారు. టీమిండియాను 46 పరుగులకే ఆలౌట్ చేశారు.
అనంతరం న్యూజిలాండ్ బ్యాటింగ్ చేపట్టే సమయానికి ఎండ రాగా.. పిచ్ ఫ్లాట్‌గా మారి బ్యాటింగ్‌కు అనుకూలించింది. రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు 4 బంతులు ఆడగానే వర్షం అంతరాయం కలిగించింది. కాసేపు ఆట జరిగినా న్యూజిలాండ్ కొన్ని వికెట్లు కోల్పోయేది.
టాస్ ఓడిపోవడం..
న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ కూడా టాస్ ఓడిపోవడమే మంచిదైందని అంగీకరించాడు. వర్షం కారణంగా న్యూజిలాండ్ 36 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత గడ్డపై టెస్ట్ విజయాన్ని అందుకుంది. ఆ జట్టు చివరి సారిగా 1988లో భారత గడ్డపై టెస్ట్ మ్యాచ్‌లో గెలిచింది. ఇప్పటి వరకు భారత గడ్డపై 37 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్.. మూడంటే మూడు మ్యాచ్‌లే గెలిచింది. అంతేకాకుండా గత 24 ఏళ్లలో భారత గడ్డపై 100 ప్లస్ రన్స్ టార్గెట్ చేధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది.