న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియాకు అనూహ్య పరాజయం ఎదురైంది. బెంగళూ వేదికగా ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అద్భుతం చేస్తారని భావించిన భారత స్పిన్నర్లు చేతులెత్తేసారు. దాదాపు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది. చివరిసారిగా 1988లో న్యూజిలాండ్ భారత గడ్డపై టెస్ట్ మ్యాచ్ గెలిచింది.
107 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ 27.4 ఓవర్లలో 2 వికెట్లు 110 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విల్ యంగ్(76 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48 నాటౌట్), రచిన్ రవీంద్ర(46 బంతుల్లో 6 ఫోర్లతో 39 నాటౌట్) రాణించారు.
భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కడే 2 వికెట్లు తీసాడు.

ఈ మ్యాచ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా అనూహ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది. అనంతరం న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. 356 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 462 పరుగుల చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం పిచ్ కండిషన్స్ సరిగ్గా అంచనా వేయకపోవడం. ఈ విషయాన్ని రోహిత్ శర్మ కూడా అంగీకరించాడు.
ఓవర్‌కాస్ట్ కండీషన్స్ ఉండగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం తాను చేసిన తప్పిదమని రోహిత్ శర్మ రెండో రోజు ఆట అనంతరమే తెలిపాడు. అయితే కొత్త బంతి కూడా టీమిండియా పతనాన్ని శాసించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌కాస్ట్ కండీషన్స్‌లో కొత్త బంతితో స్వింగ్ రాబట్టిన న్యూజిలాండ్ బౌలర్లు భారత్‌ను 46 పరుగులకే ఆలౌట్ చేశారు.
పిచ్ సరిగ్గా రీడ్ చేయని టీమిండియా ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగడంతో కొత్త బంతితో సత్తా చాటలేకపోయింది. మరో పేసర్ ఉండి ఉంటే.. న్యూజిలాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసేవారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేసింది. సర్ఫరాజ్ ఖాన్ సూపర్ సెంచరీ.. రిషభ్ పంత్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి ముందు 200 పరుగుల లక్ష్యం నమోదవుతుందని అంతా అనుకున్నారు. కానీ అప్పుడే కొత్త బంతి అందుకున్న న్యూజిలాండ్ పేసర్లు.. టీమిండియా ఇన్నింగ్స్‌ను పేకమేడల్లా కూర్చారు. 54 పరుగుల వ్యవధిలోనే టీమిండియా చివరి 6 వికెట్లు కోల్పోయింది. సెటిల్ అయిన బ్యాటర్లతో పాటు కొత్తగా క్రీజులోకి వచ్చినా బ్యాటర్లు కొత్త బంతిని ఆడలేకపోయారు. అనంతరం న్యూజిలాండ్ మాత్రం ఓపికగా ఆడి విజయాన్నందుకుంది.