
రాయ్‌పూర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. బౌలింగ్ రనప్‌లోనే బ్యాటర్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను సింగిల్ హ్యాండ్‌తో అద్భుతంగా అందుకున్నాడు. రెప్పపాటు సమయంలో చాలా కిందిగా వచ్చిన ఈ క్యాచ్‌ను హార్దిక్ అందుకున్న తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది.
హార్దిక్ పాండ్యా స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హార్దిక్ సెన్సేషనల్ క్యాచ్ పట్టాడని, అతనో అద్భుతమైన ఫీల్డర్ అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బౌలింగ్ చేసి రనప్‌లోనే క్యాచ్ అందుకోవడం ఆశమాషి వ్యవహారం కాదని అభిప్రాయపడుతున్నారు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా హార్దిక్ పాండ్యా వేసిన 10వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని హార్దిక్ ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. న్యూజిలాండ్ ఓపెనర్ డేవాన్ కాన్వే(7) స్ట్రైట్‌గా ఆడాడు. ఇక బౌలింగ్ రనప్‌లోనే ఉన్న హార్దిక్ పాండ్యా తన లెఫ్టాండ్‌తో బంతిని అద్భుతంగా అందుకున్నాడు. దాంతో కాన్వే నిరాశగా పెవిలియన్ చేరాడు. హార్దిక్ స్టన్నింగ్ క్యాచ్‌కు డెవాన్ కాన్వే సైతం బిత్తరపోయాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. భారత పేసర్ల ధాటికి 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న భారత పేసర్లు నిప్పులు చెరిగారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఫిన్ అలెన్(0)ను మహమ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేసి డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పరుగుల ఖాతా తెరవకుండానే న్యూజిలాండ్ వికెట్ కోల్పోయింది. దాంతో తీవ్ర ఒత్తిడికి లోనైన కివీస్ పూర్తిగా ఆత్మరక్షణలో ఆడింది.
అయితే ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో మహమ్మద్ సిరాజ్.. హెన్రీ నికోల్స్(2)ను స్లిప్ క్యాచ్‌గా ఔట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్‌లో మహమ్మద్ షమీ.. డారిల్ మిచెల్(1)ను రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత డెవాన్ కాన్వే(7)ను పాండ్యా స్టన్నింగ్ క్యాచ్‌తో ఔట్ చేయగా.. టామ్ లాథమ్ (1) శార్దూల్ ఠాకూర్ ఔట్ చేశాడు. దాంతో పవర్ ప్లేలోనే సగం వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. క్రీజులో గ్లేన్ ఫిలిప్స్(5 బ్యాటింగ్), గత మ్యాచ్ సెంచరీ హీరో మైఖేల్ బ్రేస్‌వెల్(5 బ్యాటింగ్) ఉన్నారు.