న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యం ఒక్కటే కారణం కాదని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. సమష్టిగా విఫలమవ్వడంతోనే ఈ ఘోర పరాభావాన్ని మూటగట్టుకున్నామని స్పష్టం చేశాడు. ఈ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో మెరుగ్గా రాణిస్తామని తెలిపాడు.
న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా 0-2తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కోల్పోయిన విషయం తెలిసిందే. వరుసగా రెండు టెస్ట్‌ల్లో టీమిండియా ఓటమిపాలైంది. రెండు టెస్ట్‌ల్లో పేలవ బ్యాటింగ్ జట్టు పతనాన్ని శాసించింది. శుక్రవారం నుంచి ముంబై వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.

11 మంది ఆడాల్సిందే..
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2025 ఫైనల్ చేరాలంటే టీమిండియా ఈ మ్యాచ్ గెలవడం కీలకం. ఈ మ్యాచ్ నేపథ్యంలో గంభీర్.. గురువారం మీడియాతో మాట్లాడాడు. ఈ సిరీస్ ఓటమికి బ్యాటర్లను మాత్రమే బాధ్యులను చేయడం సరికాదన్నాడు. మ్యాచ్ గెలవాలంటే 11 మంది అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిందేనని అభిప్రాయపడ్డాడు.
'పిచ్‌కు తగ్గట్లుగా మెరుగైన ప్రదర్శన చేస్తేనే విజయం దక్కుతుంది. కేవలం బ్యాటర్ల వైఫల్యం వల్లనే ఓటమి ఎదురైందని వారి నిందించలేను. జట్టులోని ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా ఆడాలి. మూడో టెస్ట్ కోసం ఎలాంటి మార్పులు అవసరం లేదు. మాకు అలాంటి అవసరం కూడా లేదు. రిజర్వ్ బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లకు తప్పకుండా అవకాశాలు లభిస్తాయి.
అందుకే జట్టులో హర్షిత్ రాణా..
హర్షిత్ రాణా ఈ జట్టులో భాగం కాదు. ఆస్ట్రేలియా పర్యటన ప్రిపరేషన్స్ కోసం ఇక్కడే ఉన్నాడు. ఇప్పటికే అతనికి గురించి అభిషేక్ నాయర్ క్లారిటీ ఇచ్చాడు. జట్టులో ఐపీఎల్ రిటెన్షన్ గురించి ఎలాంటి చర్చ జరగలేదు. టెస్ట్ మ్యాచ్ ఆడటం కోసమే ఇక్కడికి వచ్చాం. మా ఫోకస్ అంతా ఆ మ్యాచ్‌పైనే ఉంది.
ఈ సిరీస్ పరాజయం తీవ్రంగా బాధించింది. ఈ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. భవిష్యుత్తలో మరోసారి ఇలాంటి ఫలితాలు పునరావృతం కాకుండా చూసుకుంటాం. ఓడిపోవడం ఏ మాత్రం తప్పు కాదు. కుర్రాళ్లు మెరుగయ్యేందుకు ఈ సిరీస్ ఉపయోగపడుతోంది. కాన్పూర్ టెస్ట్‌లో ఎలాంటి ఫలితం సాధించామో అందరికీ తెలిసిన విషయమే.
ఓపికగా ఆడితేనే..
ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యాం. టెస్ట్ క్రికెట్‌లో ఓపికగా ఆడటం కీలకం. నాలుగు సెషన్ల పాటు క్రీజులో ఉంటేనే భారీ స్కోర్ సాధ్యమవుతోంది. పిచ్‌ను అర్థం చేసుకుంటేనే ఇది సాధ్యమవుతోంది. బంతిని బౌండరీకి తరలించడమే కాకుండా స్ట్రైక్ రొటేట్ చేయడం చాలా ముఖ్యం. టీ20 క్రికెట్ ఎక్కువగా ఆడటం వల్ల.. టెస్ట్‌ల్లో డిఫెన్స్ ఆడలేకపోతున్నారని అనడం సరికాదు.
కొందరు మూడు ఫార్మాట్లలో విజయవంతమైన బ్యాటర్లుగా నిలిచారు. డిఫెన్స్ ఒక్కటే ముఖ్యం కాదు. పిచ్ తగ్గట్లు ఆడాలి. వాంఖడే పిచ్ బాగుంది. ఇప్పుడు వికెట్‌ను అంచనా వేయలేం. ప్రధాన కోచ్‌గా నా జర్నీలో అనూహ్య పరాజయాలు ఎదురయ్యాయి. శ్రీలంకతో వన్డే సిరీస్ కోల్పోయాం. సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ ఓడిపోయాం.
ఈ పరాజయాలను అధిగమించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తాం. దేశం కోసం ఆడేటప్పుడు ప్రతీ మ్యాచ్ గెలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతాం. ఆటగాడిగా, కోచ్‌గా విభిన్నమైన పాత్ర పోషించడం అంత సులువైన పనికాదని తెలుసు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.