ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. అసాధారణ ప్రదర్శనతో 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టైటిల్ సొంతం చేసుకుంది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించినా.. గోల్డెన్ బ్యాట్, గోల్డెన్ బాల్ భారత ఆటగాళ్లకు దక్కలేదు. ఈ రెండు అవార్డ్స్‌ను న్యూజిలాండ్ ఆటగాళ్లు సొంతం చేసుకున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌కు గోల్డెన్ బాల్ ఇవ్వడంతో పాటు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు గోల్డెన్ బాల్ ఇస్తారు. 2017 ఎడిషన్ వరకు ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు.
కానీ తాజా టోర్నీలో గోల్డెన్ బ్యాటర్, గోల్డెన్ బాల్ అవార్డులను ప్రకటించనప్పటికీ.. వాటిని అందజేయలేదు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్రకు గోల్డెన్ బ్యాట్ దక్కగా.. మ్యాట్ హెన్రీకి గోల్డెన్ బాల్ వరించింది. అయితే ఈ ఇద్దరికి గోల్డెన్ బాల్, బ్యాట్ కాకుండా సాధారణ ట్రోఫీలనే అందజేయడం అభిమానుల ఆగ్రహానికి గురి చేసింది. ఈ అవార్డులను ఇవ్వడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వద్ద డబ్బులు లేవా? అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ టోర్నీలో రచిన్ రవీంద్ర 4 ఇన్నింగ్స్‌ల్లో 263 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ కూడా నాలుగు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు.

భారత్ నుంచి శ్రేయస్ అయ్యర్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో 243 పరుగులు చేసి రెండో స్థానంలో నిలవగా.. వరుణ్ చక్రవర్తీ మూడు ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లతో బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. మహమ్మద్ షమీ సైతం 5 ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లే పడగొట్టాడు. దాంతోనే భారత ఆటగాళ్లకు గోల్డెన్ బ్యాట్, అవార్డ్ దక్కలేదు. ఫైనల్లో విరాట్ కోహ్లీ విఫలమవడంతో ఈ అవార్డ్ రేసు నుంచి తప్పుకున్నాడు. చివరకు ఈ అవార్డులను ఇవ్వకుండా ఐసీసీ.. వాటికున్న ప్రాముఖ్యతను తగ్గించింది. ఇది ఏమాత్రం సరికాదని ఫ్యాన్స్.. కామెంట్ చేస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. మైకేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్), డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(2/45), కుల్దీప్ యాదవ్(2/40) రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ(1/74), రవీంద్ర జడేజా(1/30) తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో), శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 34 నాటౌట్) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ (2/46), మైకేల్ బ్రేస్‌వెల్(2/28) రెండేసి వికెట్లు తీయగా.. రచిన్ రవీంద్ర, కైల్ జెమీసన్ చెరో వికెట్ పడగొట్టారు.