భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్(2) బద్దకంతో రనౌట్‌గా వెనుదిరిగింది. టీ20 ప్రపంచకప్ 2024 విజేతలమనే గర్వమో లేక.. రనౌట్ చేయలేరనే అలసత్వమో తెలియదు కానీ.. విచిత్రకర రీతిలో సోఫీ డివైన్ పెవిలియన్ చేరింది.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారత స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ తెలివిగా వ్యవహరించి సోఫీ డివైన్‌ను ఔట్ చేసింది. దీప్తి శర్మ వేసిన 12వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే..?
ఈ ఓవర్ ఆఖరి బంతిని ఆఫ్ స్టంప్ లైన్‌లో వేయగా.. భారీ షాట్ ఆడేందుకు స్టెప్ ఔటైన సోఫీ డివైన్.. తన నిర్ణయాన్ని మార్చుకొని డిఫెన్స్ చేసింది. బంతి దీప్తి శర్మ చేతిలోకి వెళ్లగా.. ఆమె రనౌట్ చేస్తున్నట్లు హెచ్చరించింది. అయినా బెదరని సోఫీ డివైన్ అలానే నిల్చొంది.
వెంటనే వికెట్ కీపర్‌కు దీప్తి శర్మ బంతిని అందివ్వగా.. అంతే వేగంతో ఆమె వికెట్లను కొట్టేసింది. థర్డ్ అంపైర్ సమీక్ష కోరగా.. రీప్లేలో సోఫీ డివైన్ ఇంచు తేడాతో క్రీజు బయట ఉన్నట్లు తేలింది. సోఫీ డివైన్ బ్యాట్ పెట్టి ఉంటే నాటౌట్‌గా మిగిలేది. కానీ బద్దకంతో వ్యవహరించి వికెట్ పారేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 44.3 ఓవర్లలో 227 పరుగులు చేసింది. తెజల్ హసాబిన్స్(42), దీప్తి శర్మ(41), జెమీమా రోడ్రిగ్స్(35), యస్తికా భాటియా(37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో అమెలియా కేర్(4/42) నాలుగు వికెట్లు తీయగా.. జెస్ కేర్(3/49) మూడు వికెట్లు పడగొట్టాడు. ఎడెన్ కార్సన్ రెండు వికెట్లు తీసాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టు 132 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.