
కోల్‌కతా: కెప్టెన్ రోహిత్ శర్మ(31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీకి.. లోయరార్డర్ దీపక్ చాహర్(8 బంతుల్లో 21), హర్షల్ పటేల్(10 బంతుల్లో 18) మెరుపులు తోడవడంతో న్యూజిలాండ్ ముందు భారత్ 185 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. రోహిత్‌తో పాటు ఇషాన్ కిషన్(29), వెంటకేశ్ అయ్యర్(20), శ్రేయస్ అయ్యర్(25) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, లూకీ ఫెర్గూసన్, ఇష్ సోదీ తలో వికెట్ తీశారు.
ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం అందించారు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఫస్ట్ ఓవర్‌లోనే రోహిత్ రెండు బౌండరీలు బాదగా.. మిల్నే వేసిన రెండో ఓవర్‌లో ఇషాన్ సైతం రెండు ఫోర్లు కొట్టాడు. మూడో ఓవర్‌లో రోహిత్ ఓ భారీ సిక్సర్ బాదగా.. ఇషాన్ ఫోర్ కొట్టాడు. ప్రతీ ఓవర్‌లో పోటీ పడుతూ బౌండరీలు బాదిన ఈ జోడీ.. ఫెర్గూసన్ వేసిన 6వ ఓవర్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగింది.రోహిత్ శర్మ రెండు ఫోర్లు ఓ సిక్సర్ కొట్టగా.. ఇషాన్ ఓ బౌండరీ బాదడంతో ఆ ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి. దాంతో పవర్ ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 69 రన్స్ చేసింది.
పవర్ ప్లే ముగిసిన వెంటనే స్పిన్నర్లను రంగంలోకి దింపిన టీమ్ సౌథీ ఫలితాన్ని రాబట్టాడు. మిచెల్ సాంట్నర్ వేసిన ఏడో ఓవర్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్(29)తో పాటు సూర్యకుమార్ యాదవ్(0) డకౌటయ్యాడు. తన మరసుటి ఓవర్‌లో రిషభ్ పంత్(4) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ వెనువెంటనే వికెట్లు కోల్పోయింది.
అయితే సాంట్నర్ వేసిన 11వ ఓవర్‌లో బౌండరీ, క్విక్ డబుల్ తీసిన రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే ఇష్ సోదీ బౌలింగ్‌లో అతని స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. సిక్సర్‌తో వెంకటేశ్ అయ్యర్, బౌండరీలతో శ్రేయస్ అయ్యర్ వేగంగా ఆడే ప్రయత్నం చేశారు.
కానీ బౌల్ట్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్(20), మిల్నే బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్(25) భారీ షాట్లకు ప్రయత్నించి క్యాచ్ ఔట్లుగా వెనుదిరిగారు. క్రీజులోకి వచ్చిన హర్షల్ పటేల్ రెండు ఫోర్లు ఓ సిక్సర్ బాది ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఔటవ్వగా.. మిల్నే వేసిన ఆఖరి ఓవర్‌లో దీపక్ చాహర్ రెండు ఫోర్లు ఓ సిక్స్ కొట్టి జట్టుకు 184 పరుగుల భారీ స్కోర్ చేసింది.