
సౌతాంప్టన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ తొలి రోజు వర్షంతో తుడిచిపెట్టుకుపోగా.. రెండో రోజు రెండు సెషన్లు.. మూడో రోజు మూడు సెషన్ల ఆట సాధ్యమైంది. మూడో రోజు బ్యాడ్ లైట్ కారణంగా అరగంట ముందుగానే మ్యాచ్‌ను ముగించినా మూడు సెషన్ల పాటు పెద్దగా అంతరాయం లేకుండానే ఆట కొనసాగింది. అయితే ఎలాంటి ఆటంక లేకుండా మ్యాచ్ సాగినా టీఆర్‌పీ రేటింగ్స్‌లో మాత్రం పెద్దగా మార్పేపి కనబడలేదు.
రెండో రోజు ఆటకు పదే పదే అంతరాయం కలగడంతో ప్రేక్షకులు చికాకు గురయ్యారు. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో టీఆర్‌పీ రేటింగ్స్ పడిపోయాయి. కానీ మూడో రోజు మూడు సెషన్ల ఆట కొనసాగినా.. ఆదివారం సెలువు దినమైనా మెగా ఫైనల్‌పై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తికనబర్చలేదు. కాకపోతే సెకండ్‌డేతో పోలిస్తే టీఆర్‌పీ రేటింగ్స్ కొంత మెరుగయ్యాయి. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం రాలేదు. డిస్నీ హాట్‌స్టార్‌లో వీక్షకుల సంఖ్య ఆదివారం ఏ దశలో 19 లక్షలు దాట లేదు. ప్రేక్షకులు సంఖ్య ఎక్కువ 8-15 లక్షల మధ్యే కనిపించింది.
మాములుగా భారత్ మ్యాచ్ జరిగితే డిస్నీ+హాట్ స్టార్‌లో 25 నుంచి 30 లక్షల మంది వీక్షిస్తారు. ఐపీఎల్ టైమ్‌లో అయితే ఈ సంఖ్య 30-50 లక్షల మధ్య ఉంటుంది. రెండో రోజైన శనివారం మాత్రం వీక్షకుల సంఖ్య గరిష్టంగా 15 లక్షలు నమోదైంది. ఇక టీవీ ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తి కనబర్చినట్లు లేదు. ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌కు ఇంత తక్కువ సంఖ్యలో టీఆర్‌పీ రేటింగ్స్ రావడం విస్మయపరుస్తోంది.
ప్రేక్షకాదరణ తగ్గడానికి వర్షం అంతరాయం కలిగిస్తుండటం ఒక కారణమైతే.. మూడో రోజు ఆటలో పూర్తిగా ప్రత్యర్థి న్యూజిలాండ్ ఆధిపత్యం కొనసాగడం కూడా వీక్షకులను చానెల్ మార్చేలా చేసింది. పైగా పిచ్ పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలిస్తుండటం.. పరుగులు చేయడానికి బ్యాట్స్‌మెన్ తడబడటం కూడా టీఆర్‌పీ రేటింగ్స్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. టీమిండియా బ్యాటింగ్ లైనప్ కప్పుకూలడం.. భారత బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అభిమానులు అసహనానికి గురయ్యారు. ఇదే విషయాన్ని ట్విటర్ వేదికగా తెలియజేశారు.
అంతేకాకుండా ప్రతిష్టాత్మక ఫైనల్ ఒత్తిడి ఆటగాళ్ల కంటే అభిమానులపైనే ఎక్కువగా ఉందని, నిప్పులు చెరిగే బంతులతో కివీస్ బౌలర్లు దాడికి భారత బ్యాట్స్‌మెన్ ఔటవ్వడం.. ఆ తర్వాత కివీస్ ఓపెనర్లు సమర్థవంతంగా భారత బౌలర్లను ఎదుర్కోవడం తాము చూడలేకపోయామని కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. ఇది కూడా టీఆర్‌పీ రేటింగ్స్ పడిపోవడానికి కారణమైంది.
మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ పేస్ పదునుకు భారత్ తడబడింది. కలిసొచ్చిన పిచ్‌పై న్యూజిలాండ్ సీమర్ కైల్ జేమీసన్ (5/31) నిప్పులు చెరగడంతో భారత్ బదులివ్వలేకపోయింది. ఆదివారం తొలి సెషన్‌లోనే భారత్ పతనం అంచున నిలిచింది. చివరకు రెండో సెషన్ మొదలైన కాసేపటికే భారత్ తొలి ఇన్నింగ్స్ 92.1 ఓవర్లలో 217 పరుగుల వద్ద ముగిసింది.
రహానే (190 బంతుల్లో 49; 5 ఫోర్లు), కోహ్లి (196 బంతుల్లో 44; 1 ఫోర్) రాణించారు. బౌల్ట్, వాగ్నర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. భారత స్కోరుకు 116 పరుగుల దూరంలో నిలిచింది. విలియమ్సన్ (12 బ్యాటింగ్), రాస్ టేలర్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అశ్విన్, ఇషాంత్‌కు చెరో వికెట్ దక్కింది.