
కరాచీ: టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా విమర్శలు గుప్పించాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో భారత జట్టు ఓటమికి హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే కారణమని తెలిపాడు. బౌలర్లను వ్యూహాత్మకంగా వాడుకోలేకపోయాడని, అతని దగ్గర సరైన ప్లాన్స్ లేవని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ ఫలితంపై తన యూట్యూబ్ చానెల వేదికగా మాట్లాడిన కనేరియా.. బౌలర్లను సమర్థవంతంగా వాడుకోలేకపోయాడన్నాడు.
'హార్దిక్ పాండ్యా తన బౌలర్లను రొటేట్ చేయడంలో తెలివిగా ప్రవర్తించలేదు. శివమ్ మావిని చాలా ఆలస్యంగా రంగంలోకి దించాడు. అతనితో మొదట్లోనే బౌలింగ్ చేయించాల్సి ఉండేది. దీపక్ హుడాను కూడా ఇంకాస్త ఎక్కువగా ఉపయోగించుకోవాల్సి ఉండేది. ఇక్కడే హార్దిక్ పాండ్యా వ్యూహాలు లోపించాయి. అతని వద్ద అసలు ప్రణాళికలు ఉన్నట్లు కనిపించలేదు' అని కనేరియా విమర్శించాడు.
హార్దిక్ పాండ్యా బౌలింగ్ తీరును కూడా కనేరియా ప్రశ్నించాడు. ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడని.. సరైన లెంగ్త్‌లో బంతులను వేయలేదని విమర్శించాడు. బౌలర్ గా విఫలమైన పాండ్యా.. బ్యాటర్‌గా కూడా ఆకట్టుకోలేదు. తానే తొలి ఓవర్ వేయడం, పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్నా పేసర్లకు బంతినిచ్చి కివీస్ భారీ పరుగులు చేసేలా అవకాశాలు కల్పించడం, టీ20లో మంచి రికార్డు ఉన్న పృథ్వీ షాను కాదని అంత గొప్ప రికార్డు లేని గిల్ ను ఆడించడం వంటివి విమర్శలకు దారితీశాయి.
ఇక రాంచీలో ఓడిన టీమిండియా.. ఆదివారం లక్నో వేదికగా జరగనున్న రెండో టీ20లో అమీతుమీ తేల్చుకోనుంది. సిరీస్ మీద ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్.. ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉంది. తొలి మ్యాచ్ లో వైఫల్యాల నేపథ్యంలో లక్నో టీ20లో పలు మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది. గత మ్యాచ్ లో ధారాళంగా పరుగులిచ్చిన అర్ష్‌దీప్ సింగ్‌లపై వేటు పడొచ్చు. గిల్ స్థానంలో పృథ్వీ షా ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.