న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా ఘన విజయంతో ముగించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు టీమిండియా అదిరిపోయే సన్నాహకాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అన్ని ప్రయోగాలను చేసి ఆశించిన ఫలితాన్ని రాబట్టింది. విశాఖపట్నం వేదికగా గత మ్యాచ్‌లో ఎదురై పరాజయానికి రెండింతల బదులు తీర్చుకుంది.
తిరువనంతపురం వేదికగా శనివారం జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 46 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ సెంచరీతో కదం తొక్కగా.. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. ఈ సిరీస్‌ను టీమిండియా 4-1తో కైవసం చేసుకుంది.

272 పరుగుల భారీ లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 225 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫిన్ అలెన్(38 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 80) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. అతనికి తోడుగా మరే బ్యాటర్ రాణించలేదు. రచిన్ రవీంద్ర(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30), ఇష్ సోధి(15 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 33 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(5/51) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. అక్షర్ పటేల్(3/33) మూడు వికెట్లు తీసాడు. వరుణ్ చక్రవర్తీ(1/36), రింకూ సింగ్(1/7) తలో వికెట్ తీసారు. బౌండరీల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో భారత్ 23 సిక్సర్లతో పాటు 17 ఫోర్లు బాదగా.. న్యూజిలాండ్ 13 సిక్సర్లు, 19 ఫోర్లు కొట్టింది.
అంతకుముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 271 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లతో 103)సెంచరీతో కదం తొక్కగా.. సూర్యకుమార్ యాదవ్(30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 42), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) మెరుపులు మెరిపించారు.
భారీ లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్‌లోనే టీమ్ సీఫెర్ట్(5) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రచిన్ రవీంద్రతో కలిసి ఫిన్ అలెన్ చెలరేగాడు. భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తరహాలో ఫిన్ అలెన్ విరుచుకుపడ్డాడు. 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 22 బంతుల్లోనే సెంచరీ బాదిన ఫిన్ అలెన్.. పవర్ ప్లేలోనే జట్టుకు 79 పరుగుల స్కోర్ అందించాడు.
అతని ధాటికి 8 ఓవర్లలోనే న్యూజిలాండ్ 100 పరుగులు చేసింది. ప్రమాదకరంగా మారిన అతన్ని అక్షర్ పటేల్ క్యాచ్ ఔట్‌గా బోల్తా కొట్టించాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 100 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ వికెట్ మ్యాచ్‌ను భారత్‌వైపు మలుపు తిప్పింది. ఆ కాసేపటికే గ్లేన్ ఫిలిప్స్(7)ను అక్షర్ పటేల్ ఔట్ చేయగా.. అర్ష్‌దీప్ సింగ్ నిప్పులు చెరిగాడు.
ఒకే ఓవర్‌లో రచిన్ రవీంద్ర(30), మిచెల్ సాంట్నర్(0)లను పెవిలియన్ చేర్చాడు. బెవాన్ జాకోబ్స్(7)ను వరుణ్ చక్రవర్తీ ఔట్ చేయగా.. కైల్ జెమీసన్(9), డారిల్ మిచెల్(26) ఒకే ఓవర్‌లో ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. లాకీ ఫెర్గూసన్ అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేయగా.. ఇషాన్ సోధీని రింకూ సింగ్ ఔట్ చేసి భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.