న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియా పోరాడుతోంది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 356 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగులు చేసింది. ఇంకా 125 పరుగుల వెనుకంజలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(70 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో ఉన్నాడు. ఇంకా రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది.
ఈ పరిస్థితుల్లో టీమిండియా విజయం సాధించాలంటే ఏం చేయాలనే ప్రశ్న అభిమానులను వెంటాడుతోంది. అయితే ఈ ప్రశ్నకు దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే సమాధానం చెప్పాడు. నాలుగో రోజు టీమిండియాకు తొలి సెషన్ అత్యంత కీలకమన్నాడు. ఈ సెషన్‌ను జాగ్రత్తగా ఆడితే లంచ్ బ్రేక్ సమయానికే భారత్ ఆధిక్యం సాధిస్తుందని చెప్పాడు.

న్యూజిలాండ్ ముందు 150 నుంచి 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించవచ్చన్నాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని చెప్పిన కుంబ్లే.. భారత జట్టులో ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారని తెలిపాడు.
'నాలుగో రోజు తొలి సెషన్‌ను పూర్తిగా ఆడితే టీమిండియా స్వల్ప ఆధిక్యం సాధిస్తోంది. కానీ తొలి 10 ఓవర్లను జాగ్రత్తగా ఆడాలి. ఆరంభంలో పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇంకా నలుగురు బ్యాటర్లు ఉన్న నేపథ్యంలో 200 పరుగుల ఆధిక్యం సాధిస్తే గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. చివరి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. భారత జట్టులో ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. పిచ్‌పై క్రాక్స్ వస్తాయి. ఆ క్రాక్స్ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతాయి.'అని అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా అనూహ్యంగా 46 పరుగులకు కుప్పకూలిన విషయం తెలిసిందే. అనంతరం న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. దాంతో ఆ జట్టుకు 356 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.