న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో వరుస ఓటములతో చతికిలపడిన టీమిండియా.. ఆఖరి పోరుకు సిద్దమవుతోంది. ముంబైలోని వాంఖడే వేదికగా శుక్రవారం(నవంబర్ 1)నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. అనూహ్యంగా తొలి రెండు టెస్ట్‌ల్లో పరాజయంపాలైన టీమిండియా ఇప్పటికే 0-2తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయింది.
కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. మరోవైపు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్ట్ మ్యాచ్ గెలవడంతో పాటు సుదీర్ఘ ఫార్మాట్ చరిత్రలోనే తొలి సిరీస్ విజయాన్నందుకున్న న్యూజిలాండ్.. క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. దాంతో మూడో టెస్ట్ కూడా ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

నో స్పిన్ ట్రాక్..
తొలి రెండు టెస్ట్‌ల్లో చేసిన తప్పిదాలను గుర్తించిన టీమిండియా మేనేజ్‌మెంట్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. స్పిన్ బౌలింగ్ ఆడటంలో భారత బ్యాటర్లు తడబడ్డారనే విషయాన్ని గ్రహించిన గౌతమ్ గంభీర్.. పిచ్ తయారీ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. టర్నింగ్ ట్రాక్ కాకుండా.. మూడో టెస్ట్ కోసం బ్యాటింగ్, బౌలింగ్‌కు సమతూకంగా ఉండే పిచ్‌ను రెడీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దాంతో తుది జట్టులో కూడా మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుణె వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 11 వికెట్లతో సత్తా చాటిన వాషింగ్టన్ సుందర్‌పై కూడా వేటు వేసేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ సిద్దమైనట్లు తెలుస్తోంది. పేస్‌తో పాటు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌ను రెడీ చేస్తుండటంతో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
సుందర్‌పై వేటు..
రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను ప్రధాన స్పిన్నర్లుగా జట్టులో కొనసాగించనున్నారు. ఈ క్రమంలోనే సుందర్‌పై వేటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనూహ్యంగా రెండో టెస్ట్ బరిలోకి దిగిన సుందర్.. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి.. అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేశాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడినా.. వాషింగ్టన్ సుందర్ ఆటతీరుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. ఈ క్రమంలోనే అతన్ని భారత పర్మినెంట్ స్పిన్నర్‌గా తుది జట్టులో కొనసాగిస్తారని అంతా భావించారు. కానీ వాంఖడే మైదాన పరిస్థితుల నేపథ్యంలో సుందర్‌ను ఆడించలేని పరిస్థితి నెలకొంది. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌కు బదులు టీమిండియా అదనపు పేసర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్‌తో పాటు మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా... అశ్విన్, జడేజా స్పిన్నర్లుగా కొనసాగనున్నారు.
తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్.