టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో బౌండరీ లైన్ వద్ద వెనక్కి పరుగెత్తి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. రెండో రోజు ఆట.. న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ క్యాచ్‌తో అశ్విన్.. కీలక భాగస్వామ్యానికి తెరదించాడు.
28 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ భారత బౌలర్ల ధాటికి 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో డారిల్ మిచెల్, విల్ యంగ్ ఆచితూచి ఆడారు. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. 50 పరుగుల భాగస్వామ్యంతో భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు.

ఈ క్రమంలో రవీంద్ర జడేజా వేసిన 28వ ఓవర్‌లో ఐదో బంతికి డారిల్ మిచెల్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ బ్యాట్‌కు సరిగ్గా కనెక్ట్ అవ్వని బంతి గాల్లోకి లేచింది. మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అశ్విన్.. వెనక్కి పరుగెత్తి అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దాంతో న్యూజిలాండ్ కీలక భాగస్వామ్యానికి తెరపడగా.. టీమిండియా ఊపిరి పీల్చుకుంది.
ఆ మరుసటి ఓవర్‌లోనే టామ్ బ్లండెల్‌ను జడేజా క్లీన్ బౌల్డ్ చేయగా.. భారీ సిక్సర్లతో దూకుడుగా ఆడిన గ్లేన్ ఫిలిప్స్‌ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో న్యూజిలాండ్ 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్(146 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 90) తృటిలో శతకం చేజార్చుకోగా.. రిషభ్ పంత్(59 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు.
దూకుడుగా ఆడిన వాషింగ్టన్ సుందర్(36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్) అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో అతనికి సహకారం లభించకపోవడంతో హాఫ్ సెంచరీ సాధించలేకపోయాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్(5/103) ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. మ్యాట్ హెన్రీ, గ్లేన్ ఫిలిప్స్, ఇష్ సోధీకి తలో వికెట్ దక్కింది. భారత్‌కు 28 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్(138 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71), డారిల్ మిచెల్(129 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(4/81) న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా.. ఆకాశ్‌దీప్ ఓ వికెట్ తీసాడు.