న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో వరుస పరాజయాలతో ఢీలా పడిన టీమిండియా.. ఆఖరి పోరుకు సిద్దమైంది. శుక్రవారం(నవంబర్ 1) నుంచి ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న న్యూజిలాండ్.. క్లీన్ స్వీప్‌పై కన్నేసింది.
బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచిన న్యూజిలాండ్.. 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత గడ్డపై సంప్రదాయక ఫార్మాట్‌లో విజయాన్నందుకుంది. పుణె వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 107 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.

ఇదే జోరులో ముంబై టెస్ట్‌లోనూ భారత్‌ను ఓడించి క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో న్యూజిలాండ్ ఉంది. మరోవైపు సిరీస్ చేజారిన.. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడానికి టీమిండియా ప్రయత్నిస్తోంది. ముంబై టెస్ట్‌లో విజయం సాధించి క్లీన్ స్వీప్ తప్పించుకోవడంతో పాటు డబ్ల్యూటీసీ అగ్రస్థానాన్ని కాపాడుకోవాలనుకుంటోంది.
ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమిండియా.. తొలి రెండు టెస్ట్‌ల్లో చేసిన తప్పిదాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే మూడో టెస్ట్‌కు ర్యాంక్ టర్నర్ కాకుండా పేస్‌తో పాటు బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌ను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతోనే టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇక మూడో టెస్ట్‌కు ముందు కూడా టీమిండియాలో కీలక మార్పు జరిగినట్లు తెలుస్తోంది. టీమిండియా యువ పేసర్, కేకేఆర్ సెన్సేషన్ హర్షితా రాణాను భారత జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్న హర్షిత్ రాణా.. అస్సాంతో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
బౌలింగ్‌లో 5 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ప్రదర్శనతో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ అసాధారణ ప్రదర్శనతో ఈ గంభీర్ శిష్యుడిని భారత సెలెక్టర్లు న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌కు ఎంపిక చేసినట్లు సమాచారం. బుధవారం అతను భారత జట్టుతో కలిసే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2024 సీజన్‌లో 19 వికెట్లతో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలవడంలో హర్షిత్ రాణా కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2024 సీజన్ నుంచి భారత జట్టులోనే కొనసాగిన హర్షిత్ రాణా ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయలేదు. జింబాబ్వే, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లకు ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. ఈ పర్యటన నేపథ్యంలోనే అతన్ని న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌కు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ముంబై టెస్ట్‌లో టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌తోనే హర్షిత్ రాణా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది.