న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టును వీడి ఇంటికి వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అసలే సిరీస్‌ను కోల్పోయి వైట్‌వాష్ ముంగిట నిలిచిన టీమిండియాకు బుమ్రా దూరమవ్వడం గట్టి ఎదురుదెబ్బగా చెప్పొచ్చు.
మూడు టెస్ట్‌ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన టీమిండియా.. శుక్రవారం నుంచి ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరిగే మూడో టెస్ట్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2025 ఫైనల్ చేరాలంటే టీమిండియాకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం.

బుమ్రాకు రెస్ట్..
ఈ క్రమంలోనే టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా తమ ప్రధాన ఆటగాళ్లతో బరిలోకి దిగుతుందని అంతా అనుకున్నారు. కానీ జస్‌ప్రీత్ బుమ్రాకు మూడో టెస్ట్ నుంచి విశ్రాంతి కల్పించినట్లు ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది. అప్‌కమింగ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
వాస్తవానికి పుణె వేదికగా జరిగిన రెండో టెస్ట్‌కే బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావించింది. కానీ బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో అనూహ్య పరాజయం ఎదురవ్వడంతో రెండో టెస్ట్‌లో కొనసాగించింది. మూడో టెస్ట్‌కు దూరమైన బుమ్రా మళ్లీ.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఇంటికెళ్లిపోయిన బుమ్రా..
ఇప్పటికే బుమ్రా భారత జట్టును వీడి ఇంటికి బయల్దేరినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు గౌతమ్ గంభీర్ మాత్రం జట్టులో ఎలాంటి మార్పులు చేయడం లేదని మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. అతను చెప్పిన కాసేపటికే బుమ్రాకు రెస్ట్ ఇచ్చారనే వార్తలు తెరపైకి వచ్చాయి. న్యూజిలాండ్‌తో సిరీస్ అనంతరం టీమిండియా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా.. ఫైనల్ బెర్త్‌ను దక్కించుకోవాలంటే.. తదుపరి 6 టెస్ట్‌ల్లో 3 గెలిచి ఒక్క మ్యాచ్ డ్రా చేసుకోవాలి. న్యూజిలాండ్‌తో చివరి మ్యాచ్ గెలిచినా.. ఆస్ట్రేలియా పర్యటనలో కనీసం రెండు మ్యాచ్‌లు గెలిచి ఒక మ్యాచ్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కుతుంది. ఈ క్రమంలోనే బుమ్రాకు టీమిండియా మేనేజ్‌మెంట్ రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
7 మ్యాచ్‌లు 32 వికెట్లు..
ఆస్ట్రేలియా పర్యటనలో కుర్రాళ్లతో కూడిన భారత పేస్ విభాగాన్ని బుమ్రా నడిపించాల్సి ఉంది. మహమ్మద్ షమీ ఈ పర్యటనకు ఎంపికకాకపోవడంతో బుమ్రాపైనే పూర్తి భారం పడనుంది. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ గెలిచి 2018-19, 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజయాల్లో బుమ్రా కీలక పాత్ర పోషించాడు.
ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటి వరకు 7 టెస్ట్‌లు ఆడిన బుమ్రా.. 21.25 సగటుతో 32 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక ఐదు వికెట్ల ఘనత కూడా ఉంది. మూడో టెస్ట్‌కు బుమ్రా దూరమైతే ఆకాశ్ దీప్, సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకుంటారు.