న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారాడు. ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ తరహాలోనే భారత్ అంటే చెలరేగిపోతున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లోనూ డారిల్ మిచెల్ మరో శతకంతో చెలరేగాడు. ఈ సిరీస్‌లో అతనికి ఇది వరుసగా రెండో సెంచరీ కాగా.. మూడో 50 ప్లస్ స్కోర్.
వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో 84 పరుగులతో తృటిలో శతకం చేజార్చుకున్న డారిల్ మిచెల్.. రాజ్‌కోట్‌లో అజేయ శతకంతో(131 నాటౌట్) భారత్ పతనాన్ని శాసించాడు. సిరీస్ డిసైడర్ మ్యాచ్ అయిన ఇండోర్ వన్డేలో 137 పరుగులతో రాణించాడు. భారత్ గడ్డపై టీమిండియాతో వరుసగా ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో డారిల్ మిచెల్ నాలుగు సెంచరీలు బాదాడు. తద్వారా భారత్ అంటే తనకు ఎంత ఇష్టమో తెలియజేశాడు.

ఇండోర్‌లో చాలా ప్రశాంతంగా బ్యాటింగ్ చేసిన మిచెల్.. జడేజా బౌలింగ్‌లో సింగిల్ తీసి 106 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. అనంతరం గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. డారిల్ మిచెల్‌కు ఇది ఓవరాల్‌గా 9వ సెంచరీ కాగా.. ఇందులో భారత్‌పైనే నాలుగు శతకాలు అందుకున్నాడు. దాంతో డారిల్ మిచెల్‌ను మరో ట్రావిస్ హెడ్ అంటూ అభిమానులు పిలుస్తున్నారు. డారిల్ మిచెల్ టీమిండియాకు మొగుడిలా తయారయ్యాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు.
ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో కలిపి మొత్తం 352 పరుగులు చేశాడు. తద్వారా భారత్ గడ్డపై మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి ఓవర్‌సీస్ బ్యాటర్‌గా డారిల్ మిచెల్ నిలిచాడు. ఈ క్రమంలో అతను 44 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 1982లో శ్రీలంక బ్యాటర్ రాయ్ డయాస్ 262 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. డారిల్ మిచెల్ తాజాగా అధిగమించాడు. ఈ జాబితాలో డారిల్ మిచెల్(352) తర్వాత రాయ్ డయాస్(262), మార్లోన్ సామ్యూల్స్(254), ఆరోన్ ఫించ్(250), ఏబీ డివిలియర్స్(241) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.