టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జోరుకు బ్రేక్ పడింది. వరుసగా ఐదు వన్డేల్లో 50 ప్లస్ స్కోర్లతో నిలకడ కనబర్చిన కోహ్లీ.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో మాత్రం తీవ్రంగా నిరాశపర్చాడు. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కోహ్లీ 29 బంతుల్లో రెండు ఫోర్లతో 23 పరుగులే చేసి వెనుదిరిగాడు. క్రిస్టియన్ క్లార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
భారత ఇన్నింగ్స్ 24వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని క్రిస్టియన్ క్లార్క్ వికెట్లపైకి వేయగా.. కోహ్లీ పాయింట్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో విఫలమైన కోహ్లీ.. మూల్యం చెల్లించుకున్నాడు. కోహ్లీ బ్యాట్‌ను మిస్సైన బంతి వికెట్లను లేపేసింది. ఈ స్టన్నింగ్ డెలివరీకి కోహ్లీ బిత్తరపోయాడు. బంతి అలా ఎలా మిస్సయ్యిందనే రియాక్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తొలి వన్డేలో 93 పరుగులతో రాణించి తృటిలో శతకం చేజార్చుకున్న కోహ్లీ.. ఆ జోరును ఈ మ్యాచ్‌లో కొనసాగించలేకపోయాడు. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించిన కోహ్లీ.. మంచి టచ్‌లో కనిపించాడు. కానీ క్లార్క్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మూడో వన్డేతో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ.. ఆ తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో రెండు శతకాలతో పాటు హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్‌లో నిరాశపర్చాడు. 38 బంతులాడిన రోహిత్ 4 ఫోర్లతో 24 పరుగులే చేసి వెనుదిరిగాడు. క్లార్క్ బౌలింగ్‌లోనే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. తొలి వన్డేలోనూ రోహిత్ తక్కువ స్కోర్‌కే ఔటైన సంగతి తెలిసిందే. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించగా.. అతన్ని జెమీసన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. 53 బంతులాడిన గిల్.. 9 ఫోర్లు, సిక్స్‌తో 56 పరుగులు చేశాడు.
🚨Virat Kohli Out. #INDvsNZ #theking #ViratKohli pic.twitter.com/iVSFg3IMpq
— BABA CODER (@BabaCoder) January 14, 2026
వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(8) కూడా తీవ్రంగా నిరాశపర్చాడు. 17 బంతులాడిన అయ్యర్ 8 పరుగులే చేసి వెనుదిరిగాడు. అయ్యర్‌ను కూడా క్లార్క్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. స్టార్ ఆటగాళ్ల వైఫల్యంతో భారత్ 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి వికెట్‌కు 70 పరుగులు భాగస్వామ్యం నమోదైంది. ఆ తర్వాత భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది.