
కాన్పూర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ఎట్టకేలకు వికెట్ సాధించింది. 66 ఓవర్ల నిరీక్షణ తర్వాత తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్, స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పుణ్యాన కివీస్ 151 పరుగుల భారీ భాగస్వామ్యానికి ముగింపు పలికింది. అశ్విన్ సూపర్ బాల్‌కు సెంచరీ దిశగా దూసుకెళ్లిన కివీస్ ఓపెనర్ విలియంగ్(201 బంతుల్లో 15 ఫోర్లతో 89) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అశ్విన్ వేసిన ఫుల్లర్ లెంగ్త్ ఔట్ సైడ్ ఆఫ్ బాల్‌ను విల్ యంగ్ బిహైండ్ పాయింట్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు.
కానీ బంతి లో బౌన్స్ కావడంతో బ్యాట్‌కు ఎడ్జ్ అయింది. లో క్యాచ్‌గా వచ్చిన బంతిని కేఎస్ భరత్ అద్భుతంగా అందుకున్నాడు. అయితే అంపైర్ మాత్రం ఔటివ్వలేదు. క్యాచ్‌పై గట్టి నమ్మకంతో ఉన్న కేఎస్ భరత్ పట్టుబట్టి మరీ రివ్యూ తీసుకున్నాడు. టీవీ కెమెరాల్లో, స్నీకో మీటర్‌లో బంతి బ్యాట్‌ను తాకినట్లు తేలడంతో అంపైర్ తన తప్పిదాన్ని సరిదిద్దుకొని ఔటిచ్చాడు. దాంతో భారత్ తొలి వికెట్‌ను ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోవడానికి కారణమైన కేఎస్ భరత్‌ను సహచర ఆటగాళ్లు ప్రశంసించారు.
మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు సీనియర్ వికెట్ కీపర్ వృద్దీమాన్ సాహా మెడలు పట్టేయడంతో బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఉన్న శ్రీకర్ భరత్ కీపింగ్ చేస్తున్నాడు. తన సూపర్ కీపింగ్‌తో భారత్‌కు మంచి బ్రేక్ త్రూ అందించాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. 129/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ విల్ యంగ్ వికెట్ కోల్పోవడంతో కేన్ విలియమ్సన్(4) క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ టామ్ లాథమ్(60 బ్యాటింగ్) కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. పిచ్ పూర్తిగా ఫ్లాట్‌గా ఉండటంతో బ్యాటింగ్ సులువవుతుంది.
ఇక భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. తొలి రోజు ఆధిపత్యం చెలాయించిన భారత్.. రెండో రోజు దారుణంగా విఫలమైంది. అరంగేట్ర మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్(171 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 105) సెంచరీతో దుమ్మురేపినా.. రెండు సెషన్లలో ఒక్కరిని కూడా ఔట్ చేయలేక బౌలర్లు విఫలమవ్వడంతో న్యూజిలాండ్‌తో ఫస్ట్ టెస్ట్‌లో భారత జోరుకు బ్రేకులు పడ్డాయి. దాంతో రెండో రోజు న్యూజిలాండ్‌దే పై చేయి అయింది.