భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్ట్‌కు వర్షం మళ్లీ అంతరాయం కలిగించింది. ఇప్పటికే వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిన విషయం తెలిసిందే. నాలుగో రోజు ఆటకు వరుణుడు మళ్లీ అడ్డంకిగా మారాడు. ఉదయం నుంచే మైదానాన్ని మబ్బులు కమ్మేయగా.. ఫ్లడ్ లైట్స్ సాయంతో అంపైర్లు ఆటను కొనసాగించారు.
భారత బ్యాటర్లు పదే పదే బ్యాడ్ లైట్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. సర్ఫరాజ్ ఖాన్ అయితే తనకు బంతి కనబడటం లేదని ఫీల్డ్ అంపైర్ మొరపెట్టుకున్నాడు. అతని వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఆ వెంటనే వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపేసారు.

వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లలో 3 వికెట్లకు 344 పరుగులు చేసింది. క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(125 బ్యాటింగ్)తో పాటు రిషభ్ పంత్(53 బ్యాటింగ్) ఉన్నాడు. నాలుగో రోజు ఆటలో న్యూజిలాండ్ ఒక్క వికెట్ తీయలేకపోయింది. వర్షం కారణంగా అంపైర్లు లంచ్ బ్రేక్‌ను ముందుగానే ప్రకటించారు. దాంతో తొలి సెషన్‌లో 22 ఓవర్ల ఆటనే సాధ్యమైంది.
231/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన భారత్ నిలకడగా ఆడింది. క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్‌తో కలిసి సర్ఫరాజ్ ఖాన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆరంభంలో న్యూజిలాండ్ బౌలర్లను గౌరవించిన ఈ జోడీ.. ఆ తర్వాత బౌండరీలతో విరుచుకుపడింది. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్ 110 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
టెస్ట్ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదే తొలి సెంచరీ. మరోవైపు రిషభ్ పంత్ కూడా గేర్ మార్చి దూకుడుగా ఆడాడు. సౌథీ బౌలింగ్‌లో స్ట్రైట్ సిక్సర్ బాదిన పంత్.. ఆజాజ్ పటేల్ ఓవర్‌లో స్టెప్ ఔటై రెండు భారీ సిక్స్‌లు కొట్టాడు. ఈ మ్యాచ్‌కే ఈ సిక్స్‌లు హైలైట్‌గా నిలిచాయి. ఈ క్రమంలో పంత్ 55 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మోకాలి గాయంతో మైదానం వీడిన పంత్.. బ్యాటింగ్ చేస్తాడా? లేదా? అనే సందేహాల మధ్య బరిలోకి దిగి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా ఇంకా 12 పరుగుల వెనుకంజలో ఉంది. ఈ ఇద్దరూ ఇదే జోరు కొనసాగించి భారత్‌కు 200 ప్లస్ లక్ష్యాన్ని అందిస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించవచ్చు. చివరి రోజు నాలుగో ఇన్నింగ్స్ ఆడటం చాలా కష్టం.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 46 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. అనంతరం న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. దాంతో ఆ జట్టుకు 356 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.