న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఓటమిపాలైన భారత్.. ఐదు టీ20ల సిరీస్‌కు సిద్దమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు టీమిండియా ఆడుతున్న చివరి ద్వైపాక్షిక సిరీస్ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మెగా టోర్నీకి సంబంధించిన కాంబినేషన్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్ సిద్దం చేసుకుంది. కానీ తిలక్ వర్మ గాయంతో దూరమవ్వడం తలనొప్పిగా మారింది.
గాయంతో తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20లకు దూరమైన సంగతి తెలిసిందే. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఉన్న తిలక్ వర్మ ఫిట్‌నెస్ సాధించకపోతే.. ప్రత్యామ్నాయ ఆటగాళ్లు ఎవరా? అనేది టీమ్‌మేనేజ్‌మెంట్ కనుగొనాల్సి ఉంది. అందుకు ఈ సిరీస్‌ను వాడుకోనుంది. దాంతోనే తిలక్ స్థానంలో ఎవర్ని ఆడిస్తారా? అనేది చర్చనీయాంశమైంది. దేశవాళీ టీ20ల్లో సత్తా చాటి వచ్చిన ఇషాన్ కిషన్‌ను ఆడిస్తారా? లేక ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత టీ20 ఫార్మాట్‌కు దూరంగా ఉన్న అయ్యర్‌కు అవకాశం ఇస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఐపీఎల్ 2025 సీజన్‌లో అయ్యర్ అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ చేర్చాడు. 175.07 స్ట్రైక్‌రేట్‌తో 604 పరుగులు చేశాడు. దాంతో అతన్ని టీ20 జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ వినిపించింది. కానీ సెలెక్టర్లు పట్టించుకోలేదు. స్పిన్‌తో పాటు పేస్ బౌలింగ్‌ను అయ్యర్ సమర్థవంతంగా ఆడగలడు. అంతేకాకుండా నిలకడగా రాణించడం అతని స్పెషాలిటీ. షార్ట్ బాల్స్ సమస్యను కూడా అయ్యర్ అధిగమించాడు.
అయితే కుడి చేతి వాటం బ్యాటర్ అయిన అయ్యర్.. లెఫ్టార్మ్ బ్యాటర్ అయిన తిలక్ వర్మకు సరైన ప్రత్యామ్నాం కాదు. ఇది అతనికి లోటుగా మారనుంది. టీమిండియా టాపార్డర్ మొత్తం రైట్ హ్యాండర్స్‌తో నిండి ఉన్న నేపథ్యంలో లెఫ్టార్మ్ బ్యాటర్‌కు ప్రాధాన్యత ఇస్తే ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వస్తాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇషాన్ కిషన్ రాణించకపోయినా.. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. కెప్టెన్‌గా జార్ఖండ్‌కు టైటిల్ అందించాడు. ఈ ప్రదర్శనతోనే బ్యాకప్ వికెట్ కీపర్, ఓపెనర్‌గా భారత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇద్దరు వికెట్ కీపర్లను ఆడించడం అనవసరమని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తే అయ్యర్‌కు అవకాశం దక్కుతుంది.
అలా కాకుండా టీ20 ప్రపంచకప్ జట్టులో భాగంగా ఉన్న ఇషాన్‌కే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే అయ్యర్‌కు నిరాశే ఎదురవుతుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లోనే అందుబాటులో ఉన్న అయ్యర్ సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలనుకుంటే ఇషాన్ కిషన్ బెంచ్‌కు పరిమితమవుతాడు.