IND vs NZ 1st semi-final: వన్డే ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. గత రెండు టోర్నీల్లో సెమీఫైనల్‌కే పరిమితమైన టీమిండియా.. ఈ సారి మరో అడుగు ముందుకేసింది. బుధవారం వాంఖడే మైదానం వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది.
ఈ గెలుపుతో గత ప్రపంచకప్‌లో ఇదే న్యూజిలాండ్ చేతిలో ఇదే సెమీస్ పోరులో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టీమిండియా బెస్ట్ ఫీల్డర్ అవార్డ్‌ను ఎవరు గెలుచుకున్నారు? అనేది వెల్లడించలేదు. వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా ఫీల్డింగ్ మెరుగుపరిచేందుకు మేనేజ్‌మెంట్ కొత్తగా ఈ అవార్డ్‌ను ప్రవేశపెట్టింది.

ప్రపంచకప్ తొలి మ్యాచ్ నుంచి ఫీల్డింగ్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన ఆటగాడికి ఈ అవార్డ్‌ను అందజేస్తోంది. ఆ అవార్డ్ కూడా వినూత్న రీతిలో అందజేస్తుండటం.. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని సానుకూలంగా ఉంచుతోంది. ఆటగాళ్లు ఛిల్ అయ్యేలా.. సహచరుల ఘనతలను అస్వాదించేలా ఈ కార్యక్రమం చేస్తోంది.
ఇక ఈ అవార్డ్ ప్రజెంటేషన్స్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఎంతలా? అంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కంటే.. ఈ అవార్డ్ కోసం ఆటగాళ్లు అభిమానులు ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ప్రతీ మ్యాచ్ ముగిసిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ అవార్డ్‌ను అందజేస్తున్నారు. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్.. బెస్ట్ ఫీల్డర్‌ను ఎంపిక చేస్తున్నాడు.

ఈ వీడియోలను వెంటనే సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. అయితే సెమీస్ మ్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఆలస్యంగా అప్‌లోడ్ చేశారు. బెస్ట్ ఫీల్డర్ ఎవరు అనేదానిపై సస్పెన్స్ కొనసాగించారు. గురువారం ఈ అవార్డ్ ప్రజంటేషన్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది.
సెమీస్ మ్యాచ్‌లో బెస్ట్ ఫీల్డర్ అవార్డ్‌ను రవీంద్ర జడేజా సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డ్ కోసం సిరాజ్, కేఎల్ రాహుల్, జడేజా పోటీపడగా.. మ్యాచ్ విన్నింగ్ క్యాచ్‌లు అందుకున్న జడేకే అవార్డ్‌ను అందజేశారు. గత మ్యాచ్‌లో బెస్ట్ ఫీల్డర్ అవార్డ్ గెలుచుకున్న సూర్యకుమార్.. జడేజాకు అవార్డ్ ఇచ్చాడు.
అయితే ఈ అవార్డ్ ప్రజెంటేషన్‌ను సాధా సీధాగా నిర్వహించారు. సెమీఫైనల్ విజయం కావడం.. ఫైనల్ గెలవాల్సి ఉందనే ఇలా సింపుల్‌గా నిర్వహిస్తున్నట్లు టీ దిలీప్ స్పష్టం చేశాడు.