IND vs NZ, 1st Semi-Final: వన్డే ప్రపంచకప్ 2023లో కీలక పోరుకు రంగం సిద్దమైంది. ముంబై వేదికగా బుధవారం జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. విశ్వవిజేతగా నిలవాలనే కసితో ఉన్న ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. గెలుపు కోసం తమ సాయశక్తులా పోరాడనున్నాయి.
ఓటమెరుగని జట్టుగా లీగ్ దశను ముగించిన టీమిండియా.. అదే జోరులో న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్ చేరాలనుకుంటోంది. మరోవైపు కివీస్ తమకే సాధ్యమైన స్మార్ట్ క్రికెట్‌తో మరోసారి టీమిండియాను మట్టికరిపించి టైటిల్ ఫైట్‌కు సిద్దం కావాలని భావిస్తోంది. ఇరు జట్లు విజయంపై ధీమాగా ఉన్నాయి. బలబలాల పరంగా టీమిండియాకు కాస్త అడ్వాంటేజ్ ఉన్నా.. గత రికార్డులు న్యూజిలాండ్‌కు సానుకూలంగా ఉన్నాయి.

దూకుడైన బ్యాటింగ్‌తో అదిరిపోయే ఆరంభాలు అందిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ రాణించడం చాలా కీలకం. అతను చెలిరేగితే న్యూజిలాండ్ బౌలర్లు ఒత్తిడికి లోనవుతారు. అప్పుడు ఇతర బ్యాటర్లకు పని సులవవుతోంది. అలా కాకుండా ఆరంభంలోనే రోహిత్ ఔటైతే మాత్రం 2019 సెమీఫైనల్ పరిస్థితులు చూడాల్సి ఉంటుంది. 5 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోవాల్సిన పరిస్తితి ఏర్పడుతోంది.
కొత్త బంతితో స్వింగ్ చేసే డేంజరస్ ట్రెంట్ బౌల్ట్‌ను ఎదుర్కోవడం చాలా కీలకం. రోహిత్ శర్మ రాణిస్తే.. మిడిల్ ఓవర్లలో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ చేసే పరుగులు.. భారత జట్టు చేసే స్కోరుని డిసైడ్ చేస్తాయి.. లీగ్ స్టేజీలో ఆడినట్టే ఆడితే, రవీంద్ర జడేజా డెత్ ఓవర్లలోనే బ్యాటింగ్‌కి వస్తాడు..
తొలుత బౌలింగ్ చేయాల్సి వస్తే జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ పవర్ ప్లేలో తీసే వికెట్లు, న్యూజిలాండ్ స్కోరును డిసైడ్ చేస్తాయి. వీరిద్దరూ ఎంత త్వరగా న్యూజిలాండ్ ఓపెనర్లను ఔట్ చేయగలిగితే, న్యూజిలాండ్‌ను అంత తక్కువ స్కోరుకి కట్టడి చేయవచ్చు.
మిడిల్ ఓవర్లలో మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా.. పరుగులను కట్టడి చేయగలుగుతారు. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ కీలకంగా మారతాడు. టార్గెట్ ఎంతైనా దాన్ని ఛేదించడానికి సుదీర్ఘమైన ఇన్నింగ్స్ నిర్మించగల సత్తా విరాట్ కోహ్లీకి ఉంది.