పల్లెకెలె: ఆసియాకప్ 2023లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పసికూన నేపాల్ 231 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. ఓపెన్ ఆసిష్ షేక్(97 బంతుల్లో 8 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. సోంపల్ కమీ(56 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 48) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు కుప్పకూలింది.
కుశాల్ భుర్టెల్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) విలువైన పరుగులు చేశాడు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/61), రవీంద్ర జడేజా(3/40) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు. భారత ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్.. నేపాల్‌కు కలిసొచ్చింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌కు ఓపెనర్లు కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. టీమిండియా ఫీల్డర్లు చేసిన తప్పిదాలతో చెలరేగిన ఈ జోడీ తొలి వికెట్‌కు 65 పరుగులు జోడించింది.
తొలి 6 ఓవర్లలోనే భారత ఆటగాళ్లు మూడు క్యాచ్‌లు నేలపాలు చేశారు. వర్ష ప్రభావమో లేక సరైన ప్రాక్టీస్ లేకపోవడమో ఏమో కానీ చేతుల్లోకి వచ్చిన సునాయస క్యాచ్‌లను అందుకోలేకపోయారు. వరల్డ్ బెస్ట్ ఫీల్డర్స్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఇషాన్ కిషన్ క్యాచ్‌లు నేలపాలు చేశారు.
65 పరుగులతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని లార్డ్ శార్దూల్ ఠాకూర్ విడదీసాడు. హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న కుశాల్ భుర్టెల్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత జడేజా తన స్పిన్‌తో భీమ్ షక్రీ(7), రోహిత్ పౌడెల్(5), కుశాల్ మల్లా(2)లను వరుసగా పెవిలియన్ చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఆసిఫ్ షేక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అతని జోరుకు కోహ్లీ సాయంతో సిరాజ్ బ్రేక్ వేసాడు. తన మరుసటి ఓవర్‌లోనే గుల్జాన్ జా(23)ను కూడా సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో ఆటకు వర్షం అంతరాయం కలిగిచింది. పున:ప్రారంభమైన తర్వాత 50 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన దీపేంద్ర సింగ్, సోంపాల్ కమి జోడీని హార్దిక్ పాండ్యా విడదీసాడు.
దీపేంద్ర సింగ్(29)ను ఎల్బీగా ఔట్ చేశాడు. ఆ వెంటనే హాఫ్ సెంచరీకి చేరువైన సోంపల్ కమీ(48)ని షమీ ఔట్ చేయగా.. సందీప్ లామిచ్చెనే(9) రనౌటయ్యాడు. లలిత్ రాజ్‌బన్షి(0)ని క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్ నేపాల్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.