పల్లెకెలె: టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మరోసారి వివాదంలో చిక్కకున్నాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-నేపాల్ మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ అభిమానులకు గంభీర్ మిడిల్ ఫింగర్ చూపించాడు.
ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో మైదానం నుంచి వెళ్లిపోతున్న గంభీర్‌ను చూసి అభిమానులు కోహ్లీ.. కోహ్లీ.. అంటూ గట్టిగా అరిచారు. ఈ స్లోగన్స్‌తో ఆగ్రహానికి గురైన గంభీర్.. కోహ్లీ అభిమానుల వైపు మిడిల్ ఫింగర్ చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. కోహ్లీ ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ ప్రేమికులు గంభీర్ చర్యను తప్పుబడుతున్నారు.

ఓ మాజీ క్రికెటర్‌గా.. పార్లమెంట్ మెంబర్‌గా గంభీర్ ఇలా దిగజారి ప్రవర్తించడం సరికాదని మండిపడుతున్నారు. కోహ్లీపై కోపం ఉంటే ఇలా అభిమానులపై చూపించడం సరికాదని సూచిస్తున్నారు. అభిమానులు హద్దులు ధాటితే.. మాజీ క్రికెటర్‌గా హుందాగా ప్రవర్తించాలని కామెంట్ చేస్తున్నారు.
ఆసియాకప్ 2023 టోర్నీకి గౌతమ్ గంభీర్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. భారత్-నేపాల్ మ్యాచ్‌కు వర్షం కారణంగా అంతరాయం కలిగింది. మ్యాచ్ ఆగిపోయిన సమయంలో మైదానంలోకి వెళ్లిన గంభీర్.. మైదాన పరిస్థితులని వివరించి తిరుగు ముఖం పట్టే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పాకిస్థాన్‌తో రద్దయిన తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఔటైన తీరును గంభీర్ తప్పుబట్టాడు. చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నాడని విమర్శించాడు. ఈ కామెంట్స్ నేపథ్యంలోనే గంభీర్ కనిపించగానే అభిమానులు కోహ్లీ కోహ్లీ అంటూ అరిచారు. ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా కూడా ఈ ఇద్దరి మధ్య మైదానంలోనే గొడవ జరిగిన విషయం తెలిసిందే.
తాజా మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఆసిష్ షేక్(97 బంతుల్లో 8 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. సోంపల్ కమీ(56 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 48) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ కుశాల్ భుర్టెల్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/61), రవీంద్ర జడేజా(3/40) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు. భారత ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్.. నేపాల్‌కు కలిసొచ్చింది.