IND vs NED: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ చేయడమే కాకుండా ఓ వికెట్ తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అభిమానుల కోరిక మేరకు బంతిని అందుకున్న విరాట్ కోహ్లీ.. నెదర్లండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్(17)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 25వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ వేసిన ఈ ఓవర్ మూడో బంతికి ఎడ్వర్డ్స్ చెత్త షాట్‌తో పెవిలియన్ చేరాడు. ఈ బంతి వేసే క్రమంలో లైన్ తప్పిన కోహ్లీ వైడ్‌గా వేయగా.. ఎడ్వర్డ్స్ అనవసరంగా గెలిచి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.

వైడ్ బాల్ కాస్త వికెట్ టేకింగ్ డెలివరీగా మారడంతో విరాట్ కోహ్లీతో పాటు భారత ఆటగాళ్లంతా నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ మ్యాచ్‌కు హాజరైన విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సైతం పడి పడి నవ్వింది. విరాట్ వైడ్ బాల్‌కు ఔటవ్వడం ఫన్నీ అంటూ రియాక్షన్ ఇచ్చింది. ఈ వికెట్ తీసిన అనంతరం అనుష్క వైపు చూస్తూ సాధించానని కోహ్లీ సైగలు చేయగా.. ఆమె కూడా అతన్ని అభినందిస్తూ నవ్వులు పూయించింది.
ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఓవర్‌కు ముందు ఒక ఓవర్ వేసిన కోహ్లీ.. మొత్తం 3 ఓవర్లు బౌలింగ్ చేసి 13 పరుగులిచ్చాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తాడని ఆశించిన అభిమానులకు హాఫ్ సెంచరీతో సరిపెట్టిన కోహ్లీ.. బౌలింగ్‌లో వికెట్ తీసి డబుల్ ట్రీట్ ఇచ్చాడు. నెదర్లాండ్స్ బ్యాటింగ్ మొదలుపెట్టగానే కోహ్లీ బౌలింగ్ చేయాలంటూ ఫ్యాన్స్ గట్టిగా అరిచారు.
ఫ్యాన్స్ డిమాండ్ మేరకు కోహ్లీకి రోహిత్ శర్మ బంతిని అందించగా.. అతను వికెట్ తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 2016 టీ20 ప్రపంచకప్‌లో చివరిసారిగా వికెట్ తీసిన కోహ్లీ.. వన్డే క్రికెట్‌లో 9 ఏళ్ల క్రితం 2014లో వికెట్ సాధించాడు. కోహ్లీతో పాటు శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ కూడా బౌలింగ్ చేయడం గమనార్హం.