IND vs NED: టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో 62 బంతుల్లో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్.. రోహిత్ శర్మ రికార్డును అధిగమించాడు. ఈ ప్రపంచకప్‌లోనే అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 63 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. రాహుల్ సెంచరీ వరకు ఇదే ఫాస్టెస్ట్ రికార్డుగా ఉండగా.. అతను బంతి తేడాతో అధిగమించాడు.

ఈ జాబితాలో రాహుల్, రోహిత్ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీలు ఉన్నారు. 2007 వన్డే ప్రపంచకప్‌లో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 81 బంతుల్లో సెంచరీ బాదాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 83 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు.
ఇక ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన రెండో భారత వికెట్ కీపర్‌గా కూడా రాహుల్ రికార్డు అందుకున్నాడు. ఈ జాబితాలో రాహుల్ ద్రవిడ్(145) అగ్రస్థానంలో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 128 నాటౌట్), కేఎల్ రాహుల్(64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 102) విధ్వంసకర శతకాలతో చెలరేగగా.. రోహిత్ శర్మ(54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61), శుభ్‌మన్ గిల్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51), విరాట్ కోహ్లీ(56 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
ఈ మ్యాచ్‌లో భారత్ టాప్-5 బ్యాటర్లు 50 ప్లస్ రన్స్ చేశారు. ప్రపంచకప్ చరిత్రలోనే ఓ టీమ్ టాప్-5 బ్యాటర్లు హాఫ్ సెంచరీలు సాధించడం ఇదే తొలిసారి. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే రెండు వికెట్లు తీయగా.. పాల్ వాన్ మెకెరెన్, వాన్ డెర్ మెర్వే తలో వికెట్ తీసారు.