IND vs NAM: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. గ్రూప్-ఏలో భాగంగా న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. అమెరికాతో అతి కష్టంగా గెలిచిన టీమిండియా.. నమీబియాతో తమ అసలాట ఆడింది. పాకిస్థాన్‌తో హైఓల్టేజ్ మ్యాచ్‌కు ముందు అదిరిపోయే ప్రాక్టీస్ అందుకుంది. ఈ విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఆదివారం దాయాదీ పనిపట్టేందుకు రెడీ అయ్యింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హార్దిక్ పాండ్యా(52, 2/21) ఆల్‌రౌండ్‌షోతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిడిలార్డర్, లోయరార్డర్ కాస్త తడబడినా.. హార్దిక్, ఇషాన్ ఊచకతతో అభిమానులను అలరించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది.

ఇషాన్ కిషన్(24 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61), హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. నమీబియా కెప్టెన్ ఎరాస్మస్(4/20) నాలుగు వికెట్లు తీయగా.. బెన్ షికోంగో, జేజే స్మిత్, బెర్నార్డ్ స్కాల్ట్జ్ తలో వికెట్ తీసారు.
అనంతరం నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు స్టీన్ కాంప్(29), జాన్ ఫ్రిలింక్(22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/7) మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా(2/21), అక్షర్ పటేల్(2/20) రెండేసి వికెట్లు పడగొట్టారు. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ ధాటికి ఐర్లాండ్ బ్యాటర్లు తేలిపోయారు.
లక్ష్యఛేదనలో నమీబియా తీవ్రంగా తడబడింది.ఓపెనర్లు లారెన్, జాన్ ఫ్రీలింగ్ కాస్త దూకుడుగా ఆడినా.. వారిని వరుణ్ చక్రవర్తీ కట్టడి చేశాడు. పవర్ ప్లేలోనే కెప్టెన్ సూర్య తన ట్రంప్ కార్డ్ అయిన వరుణ్ చక్రవర్తీని బరిలోకి దించడంతో నమీబియా బ్యాటర్లు ఉక్కిరి బిక్కిరయ్యారు.
దూకుడుగా ఆడలేక.. డిఫెన్స్ చేయలేక వికెట్లు పారేసుకున్నారు. అతనికి తోడుగా ఇతర బౌలర్లు కూడా రాణించడంతో నమీబియా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత బౌలర్ల ధాటికి ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా.. ముగ్గురు బ్యాటర్లు ఖాతా తెరవలేకపోయారు. వికెట్ కీపర్ జేన్ గ్రీన్ హిట్ వికెట్ కావడంతో భారత విజయం లాంఛనమైంది.