IND vs IRE:అతని వల్లే ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రం.. ద్రవిడ్ ఉంటే అర్షదీప్ ఆడేవాడు!

హైదరాబాద్: అనామకులు అనుకున్న ఐర్లాండ్ ఆటగాళ్లు భారత్‌ను వణికించారు. మంగళవారం జరిగిన ఆఖరి టీ20లో 226 పరుగుల భారీ లక్ష్యానికి చేరువగా వచ్చి టీమిండియాను ఓడించినంత పని చేశారు. ఆఖరి ఓవర్‌లో కశ్మీర్ సంచలనం ఉమ్రాన్ మాలిక్(1/41)అద్భుతంగా బౌలింగ్ చేయడంతో భారత్ ఓటమి నుంచి గట్టెక్కింది. తద్వారా చిన్న జట్టు చేతిలో అవమానం తప్పించుకుంది. అయితే ఉమ్రాన్ మాలిక్ ఇంత అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు.
ఐర్లాండ్ బ్యాటర్ల జోరుతో పాటు మైదాన బౌండరీలు చిన్నవి కావడంతో ఆ జట్టు విజయం లాంఛనమేనని అంతా భావించారు. దానికి తోడు కీలక చివరి ఓవర్‌లో ఉమ్రాన్ నోబాల్ వేయడంతో ఆశలు వదులుకున్నారు. కానీ చివరి మూడు బంతులను ఉమ్రాన్ కచ్చితమైన వైడ్ యార్కర్లుగా సంధించి తన పవర్ ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు. మూడు బంతులకు మూడు పరుగులే ఇచ్చి భారత విజయాన్ని ఖాయం చేశాడు.

పక్కనపెట్టిన ద్రవిడ్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్‌లోకి దూసుకొచ్చిన ఉమ్రాన్ మాలిక్ నిలకడగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆరంభంలో కాస్త పరుగులిచ్చినా.. ఆ తర్వాత కచ్చితమైన బౌలింగ్‌తో వికెట్లు పడగొట్టాడు. మొత్తం 14 మ్యాచ్‌ల్లో ఉమ్రాన్ 22 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. ఈ పెర్ఫామెన్స్‌తోనే ఉమ్రాన్ టీమిండియా పిలుపును అందుకున్నాడు. సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగిన 5 టీ20ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. దాంతో అతని అంతర్జాతీయ అరంగేట్రం ఖాయమని అంతా భావించారు. కానీ టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం అతన్ని బెంచ్‌కే పరిమితం చేశాడు.

బచ్చాగాడంటూ..
ప్రస్తుతం అతను నేర్చుకునే దశలోనే ఉన్నాడని పేర్కొంటూ పక్కనపెట్టేసాడు. దాంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఉమ్రాన్ మాలిక్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక అతనికి అవకాశం ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఉమ్రాన్‌కు బదులు అతని కన్నా సీనియర్లు అయిన హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్‌లపైనే ద్రవిడ్ నమ్మకం ఉంచాడు. ఉమ్రాన్.. అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్దంగా లేడని చెప్పాడు. ఇక సౌతాఫ్రికాతో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఉమ్రాన్ మాలిక్‌ను సెలెక్టర్లు ఐర్లాండ్ పర్యటనకు కూడా ఎంపిక చేశారు. అదే సమయంలో భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంతో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆ జట్టుతో వెళ్లిపోయాడు.

లక్ష్మణ్ రాక.. ఉమ్రాన్‌కు లక్..
దాంతో ఎన్‌సీఏ డైరెక్టర్, తెలుగు తేజం వీవీఎస్ లక్ష్మణ్ ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. ఇక ఉమ్రాన్ మాలిక్ సామర్థ్యం గురించి మంచి అవగాహన ఉన్న లక్ష్మణ్.. ఐర్లాండ్‌తో తొలి టీ20లోనే అవకాశం కల్పించాడు. ఫస్ట్ మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపకపోయినా రెండో టీ20లో అవకాశం ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో ధారళంగా పరుగులిచ్చినా ఉమ్రాన్ ఓ వికెట్ తీయడంతో పాటు ఆఖరి ఓవర్‌ను కట్టడిగా బౌలింగ్ చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు.

ద్రవిడ్ ఉంటేనా..?
గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మెంటార్‌గా ఉన్నప్పుడే లక్ష్మణ్.. ఉమ్రాన్ బౌలింగ్‌ను దగ్గరుండి చూశాడు. అసలు ఇర్ఫాన్ పఠాన్ సూచనలతో ఉమ్రాన్‌ను నెట్‌బౌలర్‌గా తీసుకొచ్చింది అతనే. నటరాజన్ గాయంతో లీగ్‌కు దూరమవడంతో అతన్ని తుది జట్టులోకి తీసుకొని ఆడించాడు. ఈ క్రమంలోనే వీవీఎస్ లక్ష్మణ్ దగ్గరుండి ఉమ్రాన్‌ను అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా చేశాడు. లక్ష్మణ్‌కు బదులు ద్రవిడ్ కోచ్‌గా ఉంటే మాత్రం ఉమ్రాన్.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసేందుకు మరికొంత వేచి చూడాల్సి వచ్చేది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications