శతక్కొట్టిన దీపక్ హుడా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 225 పరుగులు చేసింది. దీపక్ హుడా(57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104) సెంచరీతో కదంతొక్కగా.. సంజూ శాంసన్(42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరి (రెండో వికెట్‌కు 176 పరుగుల) రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ మూడు వికెట్లు తీయగా.. జోష్ లిటిల్, క్రైగ్ యంగ్ రెండు వికెట్లు పడగొట్టారు.
వణికించిన బాల్‌బిర్నీ
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్(18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40), ఆండీ బాల్‌బిర్నీ(37 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 60)టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ ఇద్దరికి తోడు హరీ టెక్టర్(28 బంతుల్లో 5 ఫోర్లతో 39), జార్జ్ డాక్‌రెల్(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీసారు.
అదరగొట్టిన ఉమ్రాన్
ఐర్లాండ్ బ్యాటర్లు సైతం ధీటుగా బదులివ్వడంతో 226 పరుగులు లక్ష్యంగా చిన్నబోయింది. చిన్న బౌండరీలను క్యాష్ చేసుకున్న ఐరీష్ బ్యాట్స్‌మన్ సిక్సర్ల మోత మోగించారు. అయితే లక్ష్యాన్ని చేధించాలనే ఆతృతలో వికెట్లు పారేసుకొని సునాయసంగా గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. చివరి ఓవర్‌లో ఐర్లాండ్ విజయానికి 17 పరుగులు అవసరమయ్యాయి. అయితే అప్పటి వరకు ఐర్లాండ్ బ్యాటింగ్ సాగిన తీరును చూసి ఈ రన్స్ చేయడం పెద్ద కష్టంగా అనిపించలేదు. దానికి తోడు ఉమ్రాన్ మాలిక్ వరుసగా రెండు బంతులు కట్టడిగా బౌలింగ్ చేయగా.. అందులో రెండో బంతి నోబాల్‌గా మారింది. దాంతో ఎక్స్‌ట్రా డెలివరీతో పాటు ఫ్రీహిట్ లభించింది.
కచ్చితమైన యార్కర్లతో..
ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఐరీష్ బ్యాటర్లు వరుసగా రెండు బౌండరీలు బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేసేలా కనిపించారు. కానీ తర్వాతి మూడు బంతులను ఉమ్రాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా బౌలింగ్ చేయడంతో పాటు బౌండరీలు బాదకుండా కచ్చితమైన యార్కర్లు సంధించాడు. దాంతో చివరి మూడు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే వచ్చి భారత్ విజయం లాంఛనమైంది.


Click it and Unblock the Notifications












