టీ20 ప్రపంచకప్ 2024కు ఆతిథ్యం ఇస్తున్న అమెరికా, వెస్టిండీస్ పిచ్‌లు నెమ్మదిగా ఉన్నాయని, ఈ వికెట్స్‌పై 140 నుంచి 150 పరుగులు చేసినా గొప్పేనని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా టీమిండియా బుధవారం ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పిచ్‌లు నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో 140 పరుగులు చేసినా కాపాడుకోవచ్చని తెలిపాడు.

'140-150 పరుగులు కూడా మంచి స్కోరే. ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇటీవలే ఆ జట్టు పాకిస్థాన్‌ను ఓడించింది. ఐర్లాండ్‌ను కూడా బలమైన జట్టుగానే చూస్తున్నాం. పిచ్‌లు నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో బ్యాటర్లు ఆచితూచి ఆడాలి. పరుగుల కోసం దూకుడు కనబర్చవద్దు.'అని రోహిత్ శర్మ తెలిపాడు.
ఐర్లాండ్‌తో బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్‌పై రోహిత్ శర్మ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 'టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నలుగురు స్పిన్నర్లు కూడా ఆడవచ్చు. బౌలింగ్ ఆప్షన్ ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో స్పిన్నర్లంతా రాణించారు. వారంతా రెండేసి ఓవర్లు బౌలింగ్ చేశారు.'అని సమాధానమిచ్చాడు.
పిచ్ కండిషన్స్ అందరికీ ఒకేలా ఉంటాయని, మూడు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టును విజయం వరిస్తుందని రోహిత్ తెలిపాడు. మెగా టోర్నీలో ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రతకు ముప్పు ఉందనే హెచ్చరికల నేపథ్యంలో ఆతిథ్య దేశం సెక్యూరిటీని పెంచిందని, వారి రూల్స్‌ను గౌరవించాలన్నాడు.
లేకుంటే ఆతిథ్య దేశం తీసుకునే కఠిన చర్యలకు ఇబ్బంది పడుతారని, ఎవరూ కూడా రక్షించలేరని హెచ్చరించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఆదివారం జరిగే మ్యాచ్‌ను అడ్డుకుంటామని ఐసీస్ గ్రూప్ నుంచి ఓ పోస్టర్ వెలువడింది. దాంతో అమెరికా పోలీసులు అప్రమత్తమయ్యారు. టీమిండియా ఆటగాళ్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. టీమిండియాలోని ప్రతీ ఆటగాడికి సెక్యూరిటీ కల్పించారు.