డబ్లిన్: భారత్-ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మూడో టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పలుమార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు చివరకు ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సరిగ్గా టాస్ వేసే సమయానికి మొదలైన వర్షం.. విరామం లేకుండా కురిసింది. దాంతో మైదానం చిత్తడిగా మారింది.
చిన్నపాటి వర్షమే అయినప్పటికీ మ్యాచ్ రద్దుకు కారణమైంది. మొదటి రెండు టీ20ల్లో విజయం సాధించిన భారత్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆఖరి టీ20లోనైనా అవకాశాలు అందుకోవాలని భావించిన కుర్రాళ్ల ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. ఈ మూడు టీ20ల సిరీస్‌లో తొలి టీ20లో కూడా వర్షం అంతరాయం కలిగించగా.. భారత్ డక్ వర్త్ లూయిస్ ప్రకారం 2 పరుగులతో గెలుపొందింది.

రెండో టీ20 పూర్తిగా జరగ్గా.. భారత్ అసాధారణ విజయాన్నందుకుంది. గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేసిన పేస్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ట ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నారు. మరోవైపు రిజర్వ్ ఆటగాళ్లను పరీక్షించేందుకు ఈ నామమాత్రమైన మ్యాచ్ టీమిండియా వాడుకోవాలని భావించింది. కానీ వరణుడు టీమిండియా ఆశలపై నీళ్లు జల్లాడు.
దాంతో చివరి టీ20 మ్యాచ్ ఆడాలని భావించిన అవేష్ ఖాన్, జితేశ్ శర్మ, షాబాజ్ అహ్మద్‌లకు నిరాశే ఎదురైంది. ఈ సిరీస్‌లో వీరు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ ఆడలేదు. విండీస్ పర్యటనలోనూ జట్టులో ఉన్న అవేష్ ఖాన్ మొత్తంగా వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో బెంచ్‌కు పరిమితం కావాల్సివచ్చింది.

ఆసియాకప్ 2023 నేపథ్యంలో టీమిండియా గురువారం నుంచి బెంగళూరు వేదికగా ప్రాక్టీస్ క్యాంప్ నిర్వహించనుంది. ఆసియాకప్‌కు ఎంపికైన బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, తిలక్ వర్మ, రిజర్వ్ ప్లేయర్ సంజూ శాంసన్ నేరుగా ప్రాక్టీస్ క్యాంప్‌లో పాల్గొననున్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో జరగనున్న ఈ ప్రాక్టీస్ క్యాంప్‌కు ఆసియాకప్‌కు ఎంపికైన 17 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు.
ఆగస్ట్ 30 నుంచి ఆసియాకప్ ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్-నేపాల్ తలపడనున్నాయి. సెప్టెంబర్ 2న భారత్.. పాకిస్థాన్‌తో తలపడనుంది.