డబ్లిన్: టీమిండియా స్టార్ పేసర్, యార్కర్లకింగ్ జస్‌ప్రీత్ బుమ్రా.. అదిరిపోయే రీతిలో రీఎంట్రీ ఇచ్చాడు. వెన్ను గాయంతో ఏడాది పాటు భారత జట్టుకు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా.. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా జట్టును నడిపిస్తున్న బుమ్రా.. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసాడు.
ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ రెండో బంతిని ఔట్ స్వింగర్‌గా వేసిన బుమ్రా.. ఓపెనర్ బల్‌బిర్నీ(4)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన టక్కర్(0)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఏడాది తర్వాత వేసిన తొలి ఐదు బంతుల్లోనే రెండు వికెట్లు తీసిన బుమ్రా.. తాను ఎంతటి ప్రమాదకర బౌలర్‌నో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు.

ప్రస్తుతం ఈ రెండు వికెట్లకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బుమ్రాపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బూమ్ బూమ్ బుమ్రా.. అంటూ కొనియాడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా.. ఆతిథ్య ఐర్లాండ్ బ్యాటింగ్‌కు దిగింది. బుమ్రా ధాటికి తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఇన్నింగ్స్‌ను కెప్టెన్ పాల్ స్టిర్లింగ్, లోర్కన్ హ్యారీ టెక్టర్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అంతా ఊహించినట్లుగానే ఐపీఎల్ సంచలనం రింకూ సింగ్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అతనితో పాటు పేసర్ ప్రసిధ్ కృష్ణ అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ ఇద్దరూ జస్‌ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా అరంగేట్ర క్యాప్ అందుకున్నారు.
పిచ్ కండిషన్స్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతోనే బౌలింగ్ ఎంచుకున్నానని టాస్ సందర్భంగా బుమ్రా తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. కీలక టోర్నీకి ముందు కొన్ని మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నా. ఇన్నాళ్లు ఆటను ఎంతో మిస్సయ్యా. పునరాగమనం చేయడం సంతోషంగా ఉంది. ఐర్లాండ్‌ను మేం తక్కువ అంచనా వేయడం లేదు.
హోరాహోరీ పోరు ఉంటుందని ఆశిస్తున్నాం. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉందని ఓ పేస్ బౌలర్‌గా చెప్పగలను. వాతావరణం కూడా బాగుంది. మా జట్టులో ఇద్దరు అరంగేట్రం చేస్తున్నారు. రింకూ సింగ్, ప్రసిధ్ కృష్ణ అంతర్జాతీయ టీ20ల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ ఇద్దరికీ ఆటను ఆస్వాదించాలని చెప్పాను.'అని బుమ్రా తెలిపాడు.