డబ్లిన్: ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసింది.
బారీ మెక్‌కార్తీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. కర్టీస్ కాంఫెర్(39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓ దశలో 100 పరుగుల లోపే ఆలౌటయ్యేలా కనిపించిన ఐర్లాండ్‌ను ఈ ఇద్దరూ అసాధారణ బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(2/24), ప్రసిధ్ కృష్ణ(2/32), రవి బిష్ణోయ్(2/23) రెండేసి వికెట్లతో సత్తా చాటగా... అర్ష్‌దీప్ సింగ్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 6.5 ఓవర్లలో 2 వికెట్లకు 47 పరుగులు చేయగా వర్షం అంతరాయం కలిగించింది. ఎంతకు వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఫలితాన్ని తేల్చారు.
లక్ష్యచేధనలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), రుతురాజ్ గైక్వాడ్(19 నాటౌట్) శుభారంభం అందించడంతో భారత్ విజయాన్నందుకుంది. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించారు. పవర్ ప్లే ముగిసిన వెంటనే ఐర్లాండ్ కెప్టెన్ క్రైగ్ యంగ్‌ను బరిలోకి దించి ఫలితాన్ని రాబట్టాడు. వరుస బంతుల్లో యశస్వి జైస్వాల్(24), తిలక్ వర్మ(0)ను వెనుదిరిగారు.
ఇద్దరూ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరారు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన తిలక్ వర్మ.. గోల్డెన్ డక్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్(1 బ్యాటింగ్)తో రుతురాజ్ గైక్వాడ్(19 బ్యాటింగ్) అజేయంగా నిలిచారు. ఇరు జట్ల మధ్య రెండో ఆదివారం జరగనుంది.