డబ్లిన్: ఐర్లాండ్‌తో తొలి టీ20లో భారత బౌలర్లు దుమ్మురేపారు. జస్‌ప్రీత్ బుమ్రా(2/24), ప్రసిధ్ కృష్ణ(2/32), రవి బిష్ణోయ్(2/23) రెండేసి వికెట్లతో సత్తా చాటడంతో ఐర్లాండ్ 140 పరుగుల లక్ష్యాన్నే నమోదు చేసింది. టెయిలెండర్ బారీ మెక్‌కార్తీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసింది.
అతనికి తోడుగా కర్టీస్ కాంఫెర్(39) రాణించాడు. ఇతర బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఏడాది విరామం తర్వాత బరిలోకి దిగిన జస్‌ప్రీత్ బుమ్రా తన రెండో బంతికే ఐర్లాండ్ ఓపెనర్ ఆండీ బాల్‌బిర్నీ(4)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన లోర్కన్ టక్కర్(0)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఐదు బంతుల్లో రెండు కీలక వికెట్లు తీసి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.
ఈ పరిస్థితుల్లో కెప్టెన్ పాల్ స్టిర్లింగ్(11), హ్యారీ టెక్టర్(9) ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. కానీ అరంగేట్ర పేసర్ ప్రసిధ్ కృష్ణ.. హ్యారీ టెక్టర్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీసాడు. ఆ వెంటనే పాల్ స్టిర్లింగ్(11)ను రవి బిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో పవర్ ప్లేలోనే ఐర్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 30 పరుగులే చేసింది.
అనంతరం అదే జోరు కొనసాగించిన భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీసారు. జార్జ్ డాక్‌రెల్(1) ప్రసిధ్ కృష్ణ ఔట్ చేయగా.. క్రీజులో కుదరుకునే ప్రయత్నం చేసిన మార్క్ అడైర్(16)ను రవి బిష్ణోయ్ పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో కర్టిస్ కాంఫెర్(39), బ్యారీ మెక్‌కార్తీ ఐర్లాండ్‌ను ఆదుకున్నారు. ధాటిగా ఆడిన ఈ జోడీ ఏడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు.
అర్ష్‌దీప్ సింగ్.. కర్టీస్ కాంఫెర్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఈ జోడీని విడదీయగా.. మెక్‌కార్తీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. క్రైగ్ యంగ్ సాయంతో భారీ సిక్సర్లు బాది జట్టు స్కోర్‌ను 130 పరుగులు ధాటించాడు.