
దుబాయ్: డెత్ ఓవర్లలో దారళంగా పరుగులివ్వడంతోనే భారత్ చేతిలో ఓటమిపాలయ్యామని హాంగ్ కాంగ్ కెప్టెన్ నిజకత్ ఖాన్ అన్నాడు. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తమని ఆగం జేసిండని తెలిపాడు. బుధవారం ఏక పక్షంగా సాగిన పోరులో హాంగ్ కాంగ్ 40 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన హాంగ్ కాంగ్ సారథి నిజకత్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో 13వ ఓవర్ వరకు తమ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారని, కానీ సూర్య రాకతో పరిస్థితులన్నీ మారిపోయాయన్నాడు. ఈ మ్యాచ్‌లో తాము ఓడినా.. సూర్య ఆడిన విధానాన్ని ఆస్వాదించామని చెప్పిన నిజకత్ ఖాన్.. అతని అసాధారణ బ్యాటింగ్ తమల్ని మంత్ర ముగ్దుల్ని చేసిందని కొనియాడాడు.
'బంతితో మేం అద్భుతంగా ఆరంభించాం. 13వ ఓవర్ వరకు మా బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేశారు. ఫీల్డింగ్ సైతం అద్భుతంగా ఉంది. కానీ ఆ తర్వాత మా బౌలింగ్ లయతప్పింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ రాకతో పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. అతని అసాధారణ బ్యాటింగ్ మమల్ని కనువిందు చేసింది. ఆసియా కప్‌లో ఆడటం గొప్ప అవకాశం. మా కుర్రాళ్లకు ఇది సువర్ణవకాశం. మేమంతా ఈ రోజు కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం. ఈ క్రెడిట్ అంతా మా టీమ్ ఆటగాళ్లదే. ఈ ఓటమిపై రేపు కూర్చొని విశ్లేషణ చేస్తాం. ముఖ్యంగా డెత్ బౌలింగ్‌ను బలహీనతలను తెలుసుకొని మెరుగయ్యేందుకు కృషి చేస్తాం'అని నిజకత్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 192 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(44 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి రాగా.. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్(26), రాహుల్(36) పర్వాలేదనిపించారు. హంకాంగ్ బౌలర్లలో ఆయుష్ శుక్లా, మహమ్మద్ ఘజన్‌ఫర్ తలో వికెట్ తీసారు. 18 ఓవర్ల వరకు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అఫ్గాన్.. సూర్య సునామీ ఇన్నింగ్స్‌తో లయ తప్పింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన హాంగ్ కాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో బాబర్ హయత్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), కించిత్ షా(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీసారు.