
లీడ్స్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత అభిమానిగా మైదానంలో హడావుడి చేసిన బ్రిటన్ ప్రాంక్ స్టార్, యూట్యూబర్ డేనియెల్ జార్విస్ (జార్వో 69)పై కఠిన చర్యలు తీసుకున్నారు. భద్రతా నియమాలను ఉల్లంఘించిన అతన్ని హెడింగ్లే మైదానం నుంచి జీవిత కాలం నిషేధించారు. భారీ జరిమానా సైతం విధించారని తెలిసింది. లార్డ్స్, హెడింగ్లే టెస్టుల్లో జార్వో మైదానంలో ప్రవేశించిన విషయం తెలిసిందే.
రెండో టెస్ట్‌లో టీమిండియా దుస్తులు ధరించిన అతను మైదానంలో ప్రవేశించి ఫీల్డర్లను మోహరించాడు. జడేజా, మహమ్మద్ సిరాజ్ అతన్ని నిజంగానే టీమిండియా సభ్యుడని భావించారు. ఇక మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఔటైన తర్వాత అతడు బ్యాటు పట్టుకొని క్రీజు వద్దకు వెళ్లాడు. ఇతన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతన్ని మైదానం బయటకు ఈడ్చుకెల్లారు.
లీడ్స్ టెస్టులో పిచ్ వద్దకు వెళ్లడంతో యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అతనిపై కఠిన చర్యలు తీసుకుంది. భద్రతా నియమావళి ఉల్లంఘించాడని, అతన్ని లీడ్స్ గ్యాలరీకి అనుమతించబోమని స్పష్టం చేసింది. 'హెడింగ్లే నుంచి డేనియెల్ జార్విస్‌ను జీవితకాలం నిషేధిస్తున్నాం. మేం అతడిపై భారీ జరిమానా విధించబోతున్నాం' అని యార్క్‌షైర్ సీసీసీ అధికార ప్రతినిధి తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఏం చేయబోతున్నారని ప్రశ్నించగా.. 'గతంలో ఇలాంటి వారిని అడ్డుకొనేందుకు ప్రత్యేకంగా సిబ్బంది ఉండేవారు' అని బదులిచ్చారు.
కరోనా సమయంలో క్రికెటర్లు బుడగల్లో ఉంటున్నారు. ఇలా మైదానంలోకి ఎవరైనా వస్తే బుడగ వాతావరణానికి ఇబ్బందులు ఎదురవుతాయని విశ్లేషకులు అంటున్నారు. 'భారత్‌లో ఎవరైనా ఇలా రెండుసార్లు మైదానంలోకి వస్తే ఎంత రచ్చ చేసేవాళ్లో ఊహించుకోవచ్చు' అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. జార్వో ఇలా క్రికెట్ మైదానంలోకి దూసుకెళ్లడం ఇదే తొలిసారి కాదు.
గతంలోనూ అనేక సందర్భాల్లో అతను ఇలాంటి పనులు చేశాడు. మైదానంలో టెంట్ వేసుకొని కూడా పడుకున్నాడు. ఈ తరహా ప్రాంక్స్‌తో అతను యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాడు. గతానికి సంబంధించిన వీడియోలు కూడా లార్డ్స్ టెస్ట్ సందర్భంగా వైరల్ అయ్యాయి. ఇంగ్లండ్‌లో జార్వో పనులు నడుస్తున్నాయని, భారత్‌లో అయితే మక్కెలు విరగ్గొట్టేవారని భారత అభిమానులు అంటున్నారు.